నిన్న మామ మల్లారెడ్డికి.. నేడు అల్లుడు రాజశేఖర్‌ రెడ్డికి!

ఆయన కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు.

Update: 2024-03-07 06:12 GMT

మాజీ మంత్రి, మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే అయిన మర్రి రాజశేఖర్‌ రెడ్డికి తెలంగాణ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆయన కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు.

మర్రి రాజశేఖర్‌ రెడ్డికి హైదరాబాద్‌ శివారు దుండిగల్‌ లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌ లో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, మర్రి లక్షా్మరెడ్డి ఇంజనీరింగ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంఎల్‌ఆర్‌ఐటీఎం) కళాశాలలు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను పలు అక్రమాలు, అవకతవకలకు పాల్పడి నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు వాటిని కూల్చేశారు.

మొత్తం 8.24 ఎకరాల చెరువు (ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌)ను ఆక్రమించి పార్కింగ్‌ కోసం మర్రి రాజశేఖర్‌ రెడ్డి కాలేజీలు రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చారు.

ఈ క్రమంలో తాజాగా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో అక్రమ భవనాల కూల్చివేతలు చేపట్టారు. మరోవైపు అడ్డుకునేందుకు కొంత మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు, అధికారులు విద్యార్థులకు సర్దిచెబుతున్నారు.

కాగా రాజశేఖర్‌ రెడ్డి చెరువును ఆక్రమించి కళాశాలలో కొన్ని నిర్మాణాలు చేపట్టారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. మేడ్చల్‌ కలెక్టర్‌ ఆదేశాలతో దుండిగల్, గండి మైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్‌ అధికారులు ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి.

కాగా కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి మల్లారెడ్డికి కూడా అధికారులు షాక్‌ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి తన కాలేజీకి రోడ్డును నిర్మించడంతో అధికారులు ఆ రోడ్డును తవ్వేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు లేకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని, ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయని, విద్యార్థులు చుట్టూ తిరిగి రావల్సి ఉంటుందని మల్లారెడ్డి చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వ స్థలంలో అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డును నిర్మించారని.. దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాగా డిసెంబర్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావుపై మర్రి రాజశేఖర్‌ రెడ్డి గెలుపొందారు.

Tags:    

Similar News