చెక్ ఇచ్చి బాబును కలసిన మాజీ మంత్రి...ఇదే బెటర్ రూట్ ?

ఆయన టీడీపీలోనే పుట్టి పెరిగారు. ఆ పార్టీలోనే ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు.

Update: 2024-09-11 11:30 GMT

ఆయన టీడీపీలోనే పుట్టి పెరిగారు. ఆ పార్టీలోనే ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఎంపీగా పోటీ చేసే చాన్స్ కూడా అదే పార్టీ ఇచ్చింది. మరి ఇన్ని ఇచ్చిన పార్టీని ఆయన కష్టకాలంలో వదిలేసి వెళ్లారు. ఆయనే ప్రకాశం కి చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు.

ఆయన అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో అధికార పార్టీలో ఉన్నారు. ఆయనకు పదవులు వచ్చాయా లేవా అన్నది పక్కన పెడితే బిజినెస్ మాన్ కాబట్టి అధికార పార్టీలో ఏ ఇబ్బందులూ లేకుండా సాఫీగా పని చేసుకున్నారు అని భావించాలి.

ఇపుడు వైసీపీ అధికారంలో నుంచి దిగిపోయింది. దాంతో రాఘవరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మళ్లీ టీడీపీలో చేరాలని చూస్తున్నారు. అయితే టీడీపీలో ఆయనను చేర్చుకోవడానికి చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి.

ఆయన చంద్రబాబు సన్నిహితులకు తన బాధలు చెప్పుకుని బాబుని కలవాలని అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారని ప్రచారం సాగింది. కానీ అది కూడా దక్కలేదు. ఇంతలో బెజవాడకు వరదలు వచ్చాయి. బాబు విరాళాలు ఇవ్వమని జనాలను కోరారు

దాంతో శిద్ధా రాఘవరావు తమ వ్యాపార సంస్థల తరఫున యాభై లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆ చెక్ పట్టుకుని ఆయన సీఎం చంద్రబాబుని కలిశారు. ఆ విధంగా ఆయనకు అపాయింట్మెంట్ సులువుగానే దక్కింది అని అంటున్నారు

ఈ సందర్భంగా బాబు ఆయన యోగ క్షేమాలను కనుక్కున్నారని అంటున్నారు. దాంతో రాఘవరావుకు టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది అని ప్రచారం మొదలైంది. ఇదే రూట్ బెటర్ అని టీడీపీలో చేరాలని భావిస్తున్న వారు అంతా వరద బాధితుల సహాయం అంటూ చెక్కులు పట్టుకుని సీఎం దగ్గరకు వెళ్తున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీలో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్న వారు గత ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేసిన వారు కూడా ఇపుడు బాబు ప్రసన్నం కోసం అవే చెక్కులతో వస్తున్నారు. భారీ విరాళాలూ భూరి విరాళాలతో సీఎం ని కలవడం ద్వారా స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా తమ బాధలు కూడా చెప్పుకుంటున్నారు అని అంటున్నారు.

దాంతో వరద సాయం కాస్తా న్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది అని అంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటివి కూడా ఉంటాయని పనికి వస్తాయని అంతా అనుకుంటున్నారు.వరద సాయం చేసిన వారి పట్ల ప్రభుత్వానికి మంచి భావన ఉంటుంది. దాంతో వారికి అదే శ్రీరామ రక్ష గా ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో సైకిలెక్కాలని చూస్తున్న వారికి కూడా వరదలు మంచి అవకాశాన్ని ఇచ్చాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బాబు వరద సాయం చేయండి అని ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది.

ప్రతీ రోజూ పెద్ద ఎత్తున మొత్తాలు అందుతున్నాయి. దాంతో ప్రభుత్వం సైతం ఊహించని విధంగా సాయం అందుతోందని అంటున్నారు. మరి ఇందులో రాజకీయ వాటా కూడా చాలానే ఉందని అంటున్నారు. మరి ఈ విధంగా వరద సాయం చేస్తూ పార్టీ సాయం కోరే వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా ఉంటే కనుక ఎంత మందిని చేర్చుకుంటారు అన్నది చర్చగా నడుస్తోంది. నెల్లూరు మాజీ మంత్రి శిద్ధా రాఘరావుకు మాత్రం టీడీపీ తలుపులు తెరచుకున్నట్లే అన్న ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ముందు ముందు మరెందరు టీడీపీలో చేరుతారో.

Tags:    

Similar News