తెలంగాణలో ఒకటే స్థానం... పోటీచేసేందుకు ఒకేపార్టీలో ఆరుగురు పోటీ!
అవును... భారతీయ జనతాపార్టీలో రాబోయే లోక్ సభ ఎన్నికలకోసం హాట్ టాపిక్ గా మారింది మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం.
సాధారణంగా ఎన్నికల్లో గెలవడానికి ఐదారుగురి మధ్య.. ప్రధానంగా ఇద్దరు ముగ్గురి మధ్య పోటీ ఉంటూ ఉంటుంది.. అది అత్యంత సహజం! అయితే ఒక స్థానంలో పోటీ చేయడానికి, అందునా ఒకే పార్టీ నుంచి పోటీ చేయడానికే భారీగా పోటీ పడుతున్న నియోజకవర్గం ఒకటుంది. అదీ తెలంగాణలో ఉంది. ఆ లోక్ సభ నియోజకవర్గమే.. మల్కాజ్ గిరి! ప్రస్తుతం ఈ నియోజకవర్గం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది!
అవును... భారతీయ జనతాపార్టీలో రాబోయే లోక్ సభ ఎన్నికలకోసం హాట్ టాపిక్ గా మారింది మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం. ఈ స్థానం నుంచి పోటీ చేయడంకోసం సుమారు అరడజను మంది నాయకులు పోటీ పడుతుండటం గమనార్హం. శాసన సభ ఎన్నికల్లో ఓటమిపాలైన కీలక నేతలతో పాటు విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు సైతం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గ టికెట్ కోసం పోటీపడుతున్నారని తెలుస్తుంది.
అయితే ఈ స్థానంలో టిక్కెట్ సంపాదించడం కోసం పార్టీ కార్యక్రమాలతో కొంతమంది నేతలు ప్రజల్లోకి వెళ్తుండగా, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మరికొంతమంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఇంకొంతమంది తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు.. అధిష్టానం మనసు దోచుకునేందుకు కృషిచేస్తున్నారు. ఈ సమయంలో ఈదఫా ఈ స్థానం నుంచి పోటీచేయడం కోసం కీలక వ్యక్తులు తెరపైకి వస్తున్నారు.
ఇందులో భాగంగా... ఈటల రాజేందర్, బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్ రావు తో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్), పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత మల్క కొమురయ్య టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి నేతలు సైతం టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు.
వీరిలో ప్రధానంగా ఈటల రాజేందర్ విషయానికి వస్తే... తెలంగాణలోని మాస్ లీడర్లలో రాజేందర్ ఒకరు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ లో ఓడిపోయిన ఆయన... ఈ దఫా లోక్ సభ ఎన్నికల్లో బరిలో ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా మల్కాజ్ గిరీ నియోజకవర్గం పై మనసుపడ్డారని తెలుస్తుంది!
ఇక ఇక్కడ నుంచి ఈటలకు గట్టిపోటీగా చెబుతున్న.. బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు విషయానికొస్తే.. రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో కలియతిరుగుతూ ప్రజల మధ్య ఉంటున్నారు. ఇందులో భాగంగా... కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ రెగ్యులర్ గా స్థానిక ప్రజానికానికి, కార్యకర్తలకు టచ్ లో ఉంటున్నారు.
ఇదే సమయంలో "భరత్ దర్శన్" యాత్ర పేరుతో పార్టీ నేతలు, కార్యకర్తలను దేశ వ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలకు తీసుకుని వెళ్తున్నారు. ఇదే సమయంలో... ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ను స్థాపించి అనతి కాలంలోనే అనేక విద్యా సంస్థల అధినేతగా పారిశ్రామికవేత్తగా ఎదిగిన మల్క కొమురయ్య సైతం ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. ఎంపీగా గెలిచి తన సేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో మల్కాజ్ గిరి నుంచి పోటీకి సై అంటున్నారు.
కాగా... “డీపీఎస్” అధినేత కొమురయ్య... హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 15 పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యను అదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... సొంతంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి 25% మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య టిక్కెట్ విషయంలో భారీ పోరు ఉండొచ్చని తెలుస్తుంది. అలా అని మిగిలిన ముగ్గురినీ తీసివేయలేరు కూడా!!