'ఇండియా' ఎఫెక్ట్: చిన్న పార్టీలకు పెద్ద పీట.. మోడీ వ్యూహం ఏంటి?
కేంద్రంలో కొలువు దీరుతున్న మోడీ సర్కారు ఈ సారి గతానికి భిన్నంగా ఎన్డీయే కూటమిలోని చిన్న పార్టీలకు పెద్ద పీట వేసింది.
కేంద్రంలో కొలువు దీరుతున్న మోడీ సర్కారు ఈ సారి గతానికి భిన్నంగా ఎన్డీయే కూటమిలోని చిన్న పార్టీలకు పెద్ద పీట వేసింది. తమకు కలిసి వచ్చి.. కష్ట సమయంలో(పూర్తి మెజారిటీ లేని) ఆదుకున్న ప్రతిపార్టీకీ పదవిని ఆఫర్ చేసింది. దీంతో ఆయా పార్టీలను.. మోడీ తన పరిధి నుంచి పక్కకు జరగకుండా చూసుకునేందుకు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి అవకాశం ఇవ్వకుండా చేసేందుకు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.
కేంద్ర మంత్రివర్గంలో సంఖ్యాబలం ప్రకారం.. మొత్తం 55 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. సహాయ మంత్రులతో కలిపితే.. ఈ సంఖ్యకు మరో 30కి పెరిగినా.. సందేహం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా 30 మందితో ప్రధానిగా నరేంద్ర మోడీ సాయంత్రం ప్రమాణం చేస్తున్నారు. ఇక, ఏపీ నుంచి 16 సీట్లు దక్కించకున్న టీడీపీకి రెండు పదవులు ఇచ్చారు. ఇక, బిహార్ అధికారం పార్టీ, కూటమిలో కీలక రోల్ పోషిస్తున్న జేడీయూకు కూడా రెండు పదవులు ఆఫర్ చేశారు.
అలానే.. కేవలం 4 నుంచి 6 ఎంపీలను గెలుచుకున్న పార్టీలకు కూడా తన మంత్రివర్గంలో మోడీ చాన్స్ ఇచ్చారు. వీరిలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ ఎంపీ హెచ్‌డీ కుమారస్వామి, బిహార్‌కు చెందిన ఎల్‌జేపీ (రామ్‌విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, హిందుస్థాన్ అవామీ మోర్చా పార్టీ అధినేత జితన్ రామ్ మాంఝీ, అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, ఆర్‌ఎల్‌డీకి చెందిన జయన్ చౌదరిలకు కూడా.. మోడీ అవకాశం ఇచ్చారు. వీరి పార్టీలకు ఇద్దరు నుంచి నలుగురు మాత్రమే ఎంపీలు ఉన్నారు.
ఇక, బీజేపీలో మాజీ సీఎంలు అందరికీ మంత్రి వర్గంలో చోటు కల్పించారు. వీరిలో మధ్య ప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక బసవరాజ్ బొమ్మై, హరియాణ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ కూడా ఉన్నారు. మొత్తంగా ఎన్డీయేకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఇండియా కూటమిని కట్టడి చేసి.. అక్కడికి ఎవరూ వెళ్లకుండా చేయడమే వ్యూహంగా ఉందని తెలుస్తోంది. ఎందకంటే.. ఏ పది మంది జారి పోయినా.. ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక, మాజీ సీఎంలకు అవకాశం ఇవ్వడం వెనుక.. ఆయా రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనుండడం కారణంగా మారింది.