పిరియడ్ లీవ్స్ పై మంత్రి స్మృతి ఇరాని సంచలన వ్యాఖ్యలు

దీన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని కొన్ని రోజులుగా పార్లమెంట్ లో చర్చ జరుగుతోంది.

Update: 2023-12-14 09:02 GMT

మహిళలను ఆరోగ్య పరంగా ప్రతీనెలా బాధించేది పిరియడ్స్ (నెలసరి). ప్రకృతిపరంగా మహిళల్లో జరిగే సాధారణ ప్రక్రియ ఇది. ఈ సమయంలో మహిళలకు వచ్చే మూడ్ స్వింగ్స్, నొప్పి ఉంటాయి. దీంతో ప్రపంచంలో చాలా దేశాలు మహిళలకు పిరియడ్స్ సమయంలో వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేస్తున్నాయి. భారత్ లాంటి దేశంలో ఇంకా ఇది అమలు కాలేదు. దీన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని కొన్ని రోజులుగా పార్లమెంట్ లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంతి స్మృతి ఇరాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అమల్లో ఉన్న పిరియడ్స్ లీవ్స్ ను ఇండియాలో ప్రవేశపెట్టడం కుదరదని’ ఆమె చెప్పారు. ఈ ప్రతిపాదనను తాను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘మహిళలకు నెలసరి వైకల్యం కాదు. ఇది ప్రతీ మహిళ జీవితంలో ప్రకృతిపరంగా జరిగే సహజ ప్రక్రియ. ఈ సెలవులు ఆఫీసుల్లో వివక్షకు గురి చేయవచ్చు’ అని మంత్రి స్పష్టం చేశారు. పిరియడ్స్ సమయంలో మహిళలు పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని కూడా రూపొందించిందని ఆమె చెప్పారు. ఈ ముసాయిదాపై మహిళల్లో చైతన్యం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. 10 నుంచి 19 సంవత్సరాల యువతుల్లో నెలసరి శుభ్రతపై వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించేందుకు తెచ్చిన పథకం ‘ప్రమోషన్ ఆఫ్ మెన్‌స్ట్రువల్ హైజీన్‌ మేనేజ్‌మెంట్ స్కీమ్-ఎంహెచ్‌ఎం’ గురించి సభలో వివరించారు.

అయితే, పిరియడ్స్ లీవ్ పై పార్లమెంట్ లో నివేదిక ప్రవేశ పెట్టారు. దీన్ని ఆరోగ్య శాఖ సమీక్షించాల్సి ఉంది. దీనిలో భాగంగానే మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఈ విధంగా స్పందించారు. గతంలో కూడా ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సభలో ప్రశ్నించారు. దీనికి ఆ శాఖ మంత్రి స్మృతి ఇరాని స్పందిస్తూ ‘అన్ని సంస్థల్లో వేతనంతో కూడిన పిరియడ్స్ లీవ్ ఇవ్వాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. ఇది సహజసిద్ధమైన ప్రక్రియ కొద్ది మందిలో మాత్రమే డిస్మెనోరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇలాంటి బాధలను చాలావరకు మందులతో నయం చేసుకోవచ్చు’ అని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News