తర్వాతేమైంది? కాటేసిన నాగుపామును ఆసుపత్రి తీసుకెళ్లాడు
రోటీన్ కు భిన్నంగా జరిగిన ఈ ఉదంతం ఆగమాగం చేసింది. సాధారణంగా పాము కాటుకు గురైనంతనే చోటు చేసుకునే సన్నివేశాలు వేరుగా ఉంటాయి.
రోటీన్ కు భిన్నంగా జరిగిన ఈ ఉదంతం ఆగమాగం చేసింది. సాధారణంగా పాము కాటుకు గురైనంతనే చోటు చేసుకునే సన్నివేశాలు వేరుగా ఉంటాయి. పాము వెళ్లిపోవటం లేదంటే పామును చంపేయటం చేస్తారు. కానీ.. ఇప్పుడు చెప్పే యువకుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్నఈ ఉదంతం షాకిచ్చేలా మారింది.
యూపీలోని లాల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతుల్ఖీ గ్రామానికి చెందిన సూరత్ ను తాజాగా ఒక నాగుపాము కాటేసింది. ఇంటి వద్ద ఉన్న అతన్ని పాము కాటేసినంతనే తీవ్రమైన ఆందోళనకు గురి కాని సదరు యువకుడు.. తనను కాటేసిన పామును పట్టుకొని సంచిలో వేశాడు. దాన్ని తీసుకొని చికిత్స కోసం దగ్గర్లోని మీర్జాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బైక్ మీద వెళ్లాడు.
అత్యవసర చికిత్స విభాగానికి వెళ్లిన అతను.. తనను పాము కాటేసిందని.. తనకు వైద్యం చేయాలని కోరాడు. దీంతో ఆశ్చర్యపోయిన అక్కడి సిబ్బంది అతనికి వైద్యం చేసే లోపు.. అతను అనూహ్యంగా తన వద్ద ఉన్న సంచిలో నుంచి నాగుపామును బయటకు తీసి.. ఆసుపత్రి బెడ్ మీద ఉంచాడు. సదరుపామును చూపించి తనకు ఇంజెక్షన్ ఇవ్వాలని కోరాడు.
దీంతో.. అక్కడి సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. వెంటనే.. బెడ్ మీద ఉంచిన నాగుపామును మళ్లీ సంచిలో వేసి.. బంధించిన సూరజ్ తీరుతో అక్కడి సిబ్బంది షాక్ తిన్నారు. అతడి తీరుతో విస్మయానికి గురి కావటం.. అతడి వద్ద ఉన్నా పాము సంచిని చూసిన వారు ఆందోళన చెందారు. చివరకు అతడి సంచిని జాగ్రత్తగా ఒక చోట ఉంచి.. అతడికి యాంటీవీనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు. అతడి తెగింపును పలువురు కొనియాడుతున్నారు.