కళ్లు చెదిరేలా గులాబీ పార్టీ ఆస్తులు.. ఏడాదిలో అంతలా నిధులు

గులాబీ పార్టీకి ఉన్న మొత్తం ఆస్తుల్లో రూ.967 కోట్లు ఏడాదికి మించిన మెచ్యూరిటీ పీరియడ్ తో షెడ్యూల్ బ్యాంకుల్లో డిపాజిట్ గా ఉన్నట్లుగా తెలిపింది

Update: 2023-12-15 05:35 GMT

రెండు వారాల క్రితం వెల్లడైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన భారత రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్ 2022-23కు సంబంధించిన ఆడిట్ రిపోర్టును కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఈ సందర్భంగా ఇందులో పేర్కొన్న అంశాల్లో అందరి చూపు పడేలా గణాంకాలు ఉన్నాయి. గులాబీ పార్టీకి ఉన్న ఆస్తుల విలువ ఏకంగా రూ.1149.84 కోట్లుగా తేల్చారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏడాదిలో ఆస్తుల పెరుగుదల రేటు ఏకంగా 139.3 శాతం ఉండటం గమనార్హం.

గులాబీ పార్టీకి ఉన్న మొత్తం ఆస్తుల్లో రూ.967 కోట్లు ఏడాదికి మించిన మెచ్యూరిటీ పీరియడ్ తో షెడ్యూల్ బ్యాంకుల్లో డిపాజిట్ గా ఉన్నట్లుగా తెలిపింది. మూడు బ్యాంకుల (బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్.. ఎస్ బీఐ)కు సంబంధించి ఎనిమిది బ్రాంచీల్లో రూ.180 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమంటే.. 2022 మార్చి 31 నాటికి పార్టీ ఆస్తులు రూ.480 కోట్లు ఉండగా.. ఏడాది వ్యవధిలో ఈ ఆస్తుల విలువ 139.37 శాతానికి ఎగబాకటం ఆసక్తికరంగా మారింది.

2023 మార్చి 31 నాటికి ఆదాయం రూ.737.67 కోట్లు కాగా.. ఖర్చులు రూ.57.47 కోట్లుగా తేల్చారు. మిగిలిన రూ.680.2 కోట్లను జనరల్ ఫండ్ కు బదిలీ చేసినట్లుగా పేర్కొన్నారు. 2022 మార్చి 31 నాటికి రూ.218.11 కోట్లు రాగా.. ఈ ఏడాది ఆ మొత్తం ఏకంగా 238 శాతం పెరుగుదల అందరిని ఆకర్షిస్తోంది. ఆదాయం ఇంత భారీగా ఉన్న వేళ.. ఖర్చులు కూడా పెరిగాయి. కాకుంటే.. ఆదాయం అంతగా ఖర్చులు ఎక్కువగా లేని విషయం ఆడిట్ రిపోర్టులో కనిపిస్తుంది.

గత ఆర్థిక సంవత్సరంలో పార్టీకి రూ.198 కోట్లు విరాళాల రూపంలో రాగా.. ఈ ఏడాది కాలంలో మాత్రం రూ.683 కోట్లు రాటంతో పాటు.. ఇతర ఆదాయం రూ.16.12 కోట్ల నుంచి రూ.54.16 కోట్లకు పెరగటం విశేషం. ఎన్నికలు.. ఉద్యోగులు.. ఆడ్మినిస్ట్రేషన్ కోసం.. ఇతర అవసరాల కోసం రూ.56.86 కోట్లు ఖర్చు చేయగా.. అందులో ప్రయాణాలకే రూ.12.3 కోట్లు.. ప్రచారం కోసం రూ.14.8 కోట్లు.. ఢిల్లీ ఆఫీసు అద్దె కోసం రూ.1.77కోట్లు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News