అయ్యన్న నిర్ణయమే 'ప్రధానం'!
మరో 25 రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇవి కూడా బడ్జెట్ సమావేశాలే కావడం గమనార్హం
మరో 25 రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇవి కూడా బడ్జెట్ సమావేశాలే కావడం గమనార్హం. దీంతో అందరి దృష్టీ.. ఇప్పుడు అసెంబ్లీపైనే ఉంది. సాధారణంగా సమావేశలు ప్రారంభం అవుతున్నప్పుడు.. లేదా.. ప్రారంభమ య్యాక.. సభల గురించి చర్చించుకోవడం కామనే. కానీ, ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ ప్రత్యేక పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు రావడం.. కూటమికి 164 సీట్లు రావడంతో ప్రధాన ప్రతిపక్షం అనేది వైసీపీకి ఇవ్వాలా? వద్దా..? అనేది చర్చగా మారింది. దీంతో ఇప్పుడు అసెంబ్లీపైనే అందరూ దృష్టి పెట్టారు.
వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షం అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినా.. గుర్తింపు కోసం.. గౌరవం కోసం.. భద్రత కోసం.. పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీనిని హోదాగా కూడా భావిస్తున్నారు. అయితే.. దీనికి కోరం(10 శాతం మంది సభ్యులు) ఉండాలన్న విషయంపైనే చర్చ సాగుతోంది. వాస్తవానికి ఇలాంటి ప్రతిపాదన కూడా ఏమీ లేదు. అయినప్పటికీ.. దీనిపైనే చర్చసాగుతోంది. ఈ విషయంలో ఇప్పుడు పార్టీల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. స్పీకర్‌గా ఉన్న అయ్యన్న పాత్రుడికి ఇబ్బందిగా మారింది. తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇబ్బందేనని భావిస్తున్న ఆయన.. తాజాగా అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించినట్టు తెలిసింది.
ప్రస్తుతం ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనను సంప్రదించి.. తద్వారా.. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునేం దుకు అవకాశం ఉంటే అలానే ముందుకు సాగాలని.. అయ్యన్న భావిస్తున్నట్టు సమాచారం. కానీ, చట్టంలోనూ కోరం గురించి కానీ, ప్రధాన ప్రతిపక్షం గురించికానీ.. చెప్పలేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలన్నది అయ్యన్న చేతిలోనే ఉంది. ఆయన ఇస్తే.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. లేకపోతే.. సాధారణ ఫ్లోర్ లీడర్‌గానే జగన్ మిగిలిపోవాలి. ఈవిషయంలో మేధావు లు కూడా పలు సూచనలు చేస్తున్నారు.
వైసీపీకోరుతున్నట్టు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వడం మంచిదని కొందరుమేదావులు చెబుతున్నారు. ఇలా ఇచ్చినందున పోయేది ఏమీలేదని చెబుతున్నారు. పైగా.. స్పీకర్ సహా ప్రభుత్వ గౌరవం.. ఉదారత్వం.. వంటివి వెలుగు చూస్తాయని అంటు న్నారు. అలా కాకుండా.. వైసీపీని పక్కన పెడితే.. సభ హుందాతనంపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఇస్తే.. ఒకరకంగా.. ఇవ్వకపోతే.. మరోరకంగా సభలో్ ఏమీ ఉండబోదని చెబుతున్నారు. గతంలో ప్రధాన ప్రతిపక్షం హోదా ఉన్నప్పటికీ.. చంద్రబాబుకు మైక్ ఇవ్వలేదన్న విషయాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అయ్యన్న నిర్ణయమే ప్రధానంగా మారింది. మరి ఏం చేస్తారో చూడాలి.