రెబల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ కీలక నిర్ణయం!

ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం ఆసక్తికరంగా మారింది.

Update: 2024-01-26 13:15 GMT

ఏపీలో రోజు రోజుకీ ఎన్నికల రాజకీయం వేడెక్కిపోతుంది. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం ఆసక్తికరంగా మారింది. తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలతన్నేవాడు మరొకడుంటాడన్న చందంగా... రెబల్ ఎమ్మెల్యేలు వర్సెస్ స్పీకర్ అన్నట్లుగా రాజకీయం రసవత్తరంగా మారుతుంది!

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం కీలకంగా మారుతోంది. ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికల వేళ అధికార వైసీపీ, టీడీపీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేశారు.

ఇదే సమయంలో... వైసీపీ నుంచి టీడీపీకి చేరువైన నలుగురు ఎమ్మెల్యేలతోపాటు జనసేన నుంచి వైసీపీ వైపు మళ్లిన ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు జారీ చేసారు. ఇందులో భాగంగా... ఈ నెల 29న స్వయంగా విచారణకు హాజరవ్వాలని.. పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలని సూచించారు. దీంతో ఆ రోజు ఏమి జరగబోతుంది.. ఈ విషయంపై రెబల్ ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

వచ్చే నెలలో ఏపీ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో సంఖ్యా బలం ఆధారంగా ఈ మూడు సీట్లను అధికార వైసీపీకి దక్కనున్నాయి. అదే జరిగితే రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం జీరో కానుంది. ఈ నేపథ్యంలో... వైసీపీ నుంచి ముగ్గురు సభ్యులు రాజ్యసభకు ఎంపిక కాకుండా టీడీపీ వ్యూహాలు రచిస్తుందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... అధికార పార్టీలో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పుల వేళ అసంతృప్తితో ఉన్న సిట్టింగులను తమవైపు తిప్పుకోవాలని యత్నిస్తోంది. దీంతో... ఈ ఎత్తులను గమనించిన వైసీపీ.. అందుకు పైఎత్తులు వేస్తుంది. ఇందులో భాగంగా... వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు రెబల్స్ పైన అనర్హత వేటు కోసం స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.

ఇదే సమయంలో... తమ పార్టీ నుంచి వైసీపీకి దగ్గరైన నలుగురు ఎమ్మెల్యేల పైన చర్యలు కోరుతూ టీడీపీ కూడా ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ను నిరసిస్తూ గంటా శ్రీనివాస్ సమర్పించిన రాజీనామాకు స్పీకర్ ఇటీవల ఆమోదం తెలిపారు. దీనిపై టీడీపీ & గంటా చిన్నపాటీ రాద్ధాంతం స్టార్ట్ చేశారనే చర్చ జరిగింది. అయితే ఈ వ్యవహారంపై స్పీకర్ వివరణ ఇచ్చారు.

ఆయన రాజీనామా ఆమోదించకుండా ఇంతకాలం చూడం, చెప్పడం జరిగిందని.. అయితే ఇక తన టెర్మ్ పూర్తవుండటంతో... పెండింగ్ విషయాలన్నీ క్లియర్ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గంటా రాజీనామాను ఆమోదించినట్లు తెలిపారు. దీంతో... రాజీనామా చేసిన తర్వాత.. తీరా ఆమోదించాక ఈ అల్లరేమిటి..? ఆమొదించరనే ఉద్దేశ్యంతో రాజీనామా చేశారా..? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

ఈ క్రమంలో వైసీపీలో గెలిచి టీడీపీ లో చేరిన ఎమ్మెల్యేలు స్పీకర్ ను 30 రోజుల వ్యవధి అడిగారు!! ఈ నేపథ్యంలో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఈ నెల 29న ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని రెబల్ ఎమ్మెల్యేలకు లేఖలు పంపారు. దీంతో ఈ నెల 29న ఏమి జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News