పులివెందులలో జగన్ కు షాక్.. వైఎస్సార్ పేరు తీసేసి ఆ పేరు!
ఇలా ఎందుకు జరిగింది? అసలేమైంది? వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటకాలంటి పులివెందులలో ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటన్నది చూస్తే..
చేసే పని ఏదైనా.. అందరికి ఆమోద యోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అందుకు భిన్నంగా తమకు నచ్చింది మాత్రమే చేస్తామన్న మైండ్ సెట్ తో తాత్కాలికంగా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆ తర్వాత తాము తీసుకున్న నిర్ణయాన్ని మరొకరు మార్చేస్తారన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వైఎస్ జగన్ కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల పట్టణంలో ఆయన ఏరికోరి పెట్టిన తన తండ్రి పేరును తాజాగా తీసేసి.. దానికి ముందున్న పాత పేరును పెట్టేసిన వైనం చోటు చేసుకుంది. పులివెందుల కూరగాయల మార్కెట్ పేరు విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీనికి స్థానిక పురపాలక పాలక వర్గమే వైఎస్సార్ పేరును మార్చేస్తూ తీర్మానం చేసింది. ఇలా ఎందుకు జరిగింది? అసలేమైంది? వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటకాలంటి పులివెందులలో ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటన్నది చూస్తే..
పులివెందుల పట్టణంలో ఉన్న కూరగాయల మార్కెట్.. స్థానిక శ్రీరంగనాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉంది. దీన్ని మోడల్ మార్కెట్ గా నిర్మించారు. అప్పట్లో దీన్ని ప్రారంభించిన దివంగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఈ మార్కెట్ కు శ్రీరంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ పేరును పెట్టారు. అయితే.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక శ్రీరంగనాథ స్వామి ఆలయం ఎదుట ఉన్న కూరగాయల మార్కెట్ ను కొత్తగా నిర్మించారు. 2022 డిసెంబరు 21న దీన్ని ప్రారంభించారు. అయితే.. అప్పటివరకు ఉన్న దేవుడి పేరైన శ్రీరంగనాథ స్వామి పేరును తీసేసి..వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూరగాయల మార్కెట్ గా మార్పు చేశారు.
ఈ నిర్ణయంపై అప్పట్లో పులివెందుల పురపాలక సంఘం తీర్మానం చేసి ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపగా.. దాన్ని ఓకే చేస్తూ... నిర్ణయాన్ని అధికారికం చేశారు. కూరగాయల మార్కెట్ పేరు మార్పుపై హిందూ సంఘాలతో పాటు.. టీడీపీ నేత తూగుట్ల మధుసూదన్ రెడ్డి.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి శ్రీరంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ గా పేరును మారుస్తామని పేర్కొన్నారు.
ఇందుకు తగ్గట్లే.. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత పురపాలక సంఘం పేరు మార్పుపై తీర్మానం చేసింది. ప్రభుత్వానికి తమ కొత్త నిర్ణయాన్ని పంపి.. పేరు మార్చాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. పులివెందుల పురపాలక సంఘం పేరును అధికారికంగా మార్చినట్లుగా ఆదేశాలు జారీ చేశారు. పులివెందుల పట్టణ ప్రజలు సైతం దేవుడి పేరును ఉంచాలన్న డిమాండ్ ఎక్కువగా ఉంది. తాజాగా పులివెందుల కూరగాయల మార్కెట్ పేరు దేవుడి పేరుగా మారిపోయింది. కొసమెరుపు ఏమంటే.. ఇప్పుడు కూడా పులివెందుల పురపాలక సంఘం వైసీపీ చేతిలోనే ఉంది. అయినప్పటికీ వైఎస్సార్ పేరును తీసేసి.. దేవుడి పేరును పెట్టే విషయంలో వారే స్వయంగా తీర్మానం చేసి.. ప్రభుత్వానికి నివేదన చేయటం ఆసక్తికరంగా మారింది.