'ఇట్లు మీ శ్రీరెడ్డి'... జగన్, లోకేష్ లకు స్వదస్తూరితో లేఖ!
తాజాగా ఊహించని స్థాయిలో అటు వైసీపీ అధినేత జగన్ కు, ఇటు మంత్రి నారా లోకేష్ కు స్వదస్తూరితో లేఖ రాశారు!
ఏపీ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా పలు ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో చెలరేగిపోయినట్లుగా ప్రవర్తించిన శ్రీరెడ్డి... తాజాగా ఊహించని స్థాయిలో అటు వైసీపీ అధినేత జగన్ కు, ఇటు మంత్రి నారా లోకేష్ కు స్వదస్తూరితో లేఖ రాశారు! ఇప్పుడు ఇది వైరల్ గా మారుతోంది.
అవును... గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో అత్యంత వివాదాస్పదం అయినవారిలో శ్రీరెడ్డి ఒకరు. నెట్టింట ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి. అవతలి వ్యక్తి ఎవరు, వారి హోదా ఏమిటి అనే ఇంగితం ఏమాత్రం లేకుండా.. ఏకవాక్యంతో సంభోదిస్తూ, రాయలేని భాష ప్రయోగిస్తూ వీడియోలు, పోస్టులు పెట్టేవారు!
అయితే... కూటమి ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టినవారు, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసినవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సమయంలో శ్రీరెడ్డిపైనా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో.. ఆమె కాగితం, కలం చేతపట్టారు.
లోకేష్ అన్నకు విజ్ఞప్తి!:
ఈ సందర్భంగా వైఎస్ జగన్, నారా లోకేష్ లకు లేఖలు రాశారు శ్రీరెడ్డి. ఇందులో ముందుగా నారా లోకేష్ ను ఉద్దేశించి రాస్తూ... "ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి!" అని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా తాను పుట్టింది గోదావరి అయినా.. పెరిగింది మొత్తం విజయవాడ పరిశరాల్లో అని, తనకు లోకేష్ సామాజికవర్గానికి చెందినవారే 95% స్నేహితులు ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్థావించినట్లు గుర్తుచేసుకుంటూ... అమరావతి రాజధానిగా రావడం తన కుటుంబసభ్యులను ఎంతో సంతోష పెట్టిందని.. తమకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని.. అందువల్ల తమ పేరెంట్స్ టీడీపీకే ఓటు వేశారని అన్నారు. మీతో నేరుగా మాట్లాడమని తన కుటుంబ సభ్యులు చెప్పారని.. అయినా తనకు అంత స్థాయి లేదని చెబుతూ.. ఈ ఓపెన్ లెటర్ అని తెలిపారు.
ఈ సందర్భంగా... గత పదిరోజులుగా మీడియాలో వచ్చే కథనాలు, వాటి కింద కనిపించే కామెంట్లు, స్పీచ్ లు, డిస్కషన్లు, డిబేట్లు, కూటమిలో ఉన్న అందరూ చేస్తున్న అటాక్ తర్వాత తనకు ఓ విషయం అర్ధమైందని.. అదేమిటంటే... తాను ఇంతకాలం ఎంతమంది మనోభావాలు దెబ్బతీసిందీ తెలిసిందని రాసుకొచ్చారు.
ఎన్నో పూజలు, ప్రార్థనలు చేసే తాను ఇంత జుగుప్సాకరంగా ఇంతకాలం ఎలా మాట్లాడింది తనకు తెలియడం లేదని.. అందుకే ముందుగా చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులకు, హోంమినిస్టర్ కు, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకి, 99, ప్రైం టీవీ, పవన్ కల్యాణ్, వీరమహిళలకు తన క్షమాపణలు అని తెలిపారు.
అయితే.. ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లేఖ కాదని.. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే తన బుద్ది వంకర అవుతుందని అనుకోవద్దని.. అలా జరిగితే ప్రైవేటు వ్యక్తులతో తనను ఏమైనా చేసుకోవచ్చని.. ఇకపై తప్పుడు భాషను ఎవరిపైనా వాడనని.. తమ కుల దైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నట్లు శ్రీరెడ్డి రాసుకొచ్చారు.
ఇక.. ఇంట్లో పెళ్లి కావాల్సిన ముగ్గురు పిల్లలు ఉన్నారని.. దయచేసి తన కుటుంబాన్ని కాపాడాలని.. తన బాధ తనకంటే ఎక్కువగా ఇంతమందిని పరిపాలించే మీకే బాగా అర్ధమవుతుందని.. కేసుల నుంచి తనను విముక్తురాలిని చేయాలని కోరారు. ఇదే సమయంలో చిరంజీవి, నాగబాబు, సినిమా ఫ్రెండ్స్ కి సారీ చెబుతున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో... సినిమాలోనూ, రాజకీయాల్లోనూ తాను ఫెయిల్ అయినట్లు, అందుకు తాను అంగీకరిస్తున్నట్లు చెబుతూ.. షర్మిల, సునీత లకు కూడా క్షమాపణలు చెబుతూ శ్రీరెడ్డి లేఖ రాశారు!
జగనన్నకి, భారతమ్మకు నమస్కారాలు!:
ఈ సందర్భంగా మరో లేఖ రాసిన శ్రీరెడ్డి.. జగన్, భారతికి హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఈ జన్మకు వారిద్దరినీ నేరుగా కలిసే అదృష్టం కానీ, కలిసి ఫోటో దిగే అవకాశం కానీ కలిగి ఉండే అదృష్టాన్ని తాను కోల్పోయానని అనుకుంటున్నట్లు తెలిపారు.
దానికి కారణం... వైసీపీకి తన పేరుతో చెడ్డపేరు తీసుకొచ్చినట్లు అని శ్రీరెడ్డి స్పందించారు. తాను గతలో చేసిన పనికి.. నేడు మీడియాలో చాలా మంది పార్టీని దుమ్మెత్తి పోయడం తనను మానసికంగా కృంగదీసిందని.. పార్టీని పలువురి మాటల దాడిలో సేవ్ చేస్తున్నానని అనుకున్నానే తప్ప డ్యామేజ్ చేస్తున్నట్లు గ్రహించలేకపోయానని ఆమె వెల్లడించారు.
తాను వైసీపీ సభ్యురాలిని కానప్పటికీ... సాక్షిలో పనిచేసినప్పటి నుంచీ జగన్, భారతిలపై గౌరవమర్యాదలు ఏర్పడ్డాయని.. ఒకప్పుడు పార్టీ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడిందని అన్నారు. తన పాపం మీకు అంటొందని.. తాను చేసిన పనులు మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టాయో అర్ధం చేసుకోగలలని అన్నారు.
ఈ సందర్భంగా తాను వైసీపీకి, వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని.. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావడం ఇష్టం లేదని.. తనను క్షమించాలని కోరుతూ... ఇట్లు మీ శ్రీరెడ్డి అని లేఖను ముగించారు.