వాలంటీర్ హత్యకేసులో మాజీ మంత్రి కుమారుడి పేరు... అసలేం జరిగింది?

డాక్టర్ బీఅర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో అమలాపురానికి చెందిన వైసీపీ నేత

Update: 2024-10-21 06:13 GMT

డాక్టర్ బీఅర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో అమలాపురానికి చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారనే ప్రచారం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇదే సమయంలో.. అతడిని అదుపులోకి తీసుకున్నారనే ప్రచారమూ తెరపైకి వచ్చింది!

అవును... కోనసీమలో అల్లర్లు జరిగిన సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ ను జూన్ 6 - 2022వ తేదీన హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తానికి చెందిన నిందితుడు, మృతుడికి స్నేహితుడు అయిన ధర్మేశ్ అనే వ్యక్తిని పోలీసులు విచారించి.. ఈ నెల 18న అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపించినట్లు చెబుతున్నారు!

ఈ నేపథ్యంలో.. ఈ కేసులో నలుగురు నిందితులతోపాటు పినిపే శ్రీకాంత్ గురించి కూడా పోలీసులు గాలిస్తున్నారని అంటున్నారు. అయితే.. శ్రీకాంత్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... తమిళనాడులోని మధురైలో అతడిని అదుపులోకి తీసుకున్నారని.. అనంతరం అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారని అంటున్నారు.

ఈ క్రమంలో... ట్రాన్సిట్ వారెంట్ పై శ్రీకాంత్ ను ఏపీకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. పినిపే శ్రీకాంత్ అరెస్ట్ ను పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఈ విషయం ప్రధానంగా స్థానికంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

కాగా... వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్యకు స్థానికంగా ఉన్న ఓ లాడ్జిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ధర్మేశ్.. దుర్గాప్రసాద్ ను కోటిపల్లి రేవు వద్దకు టూవీలర్ పై తీసుకెళ్లగా.. వెనుక కారులో నలుగురు అనుసరించారట. అనంతరం రేవు వద్ద పడవలో అతడిని లోపలకు తీసుకెళ్లగా.. కారులో వచ్చినవారిలో ముగ్గురు దుర్గాప్రసాద్ మెడకు తాడు బిగించి హత్యచేశారట.

ఈ విషయాలను నిందితుడు ధర్మేశ్ పోలీసుల విచారణలో చెప్పినట్లు చెబుతున్నారు! అయితే... మృతుడి భార్య కంప్లైట్ ఇవ్వడంతో తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహం లభించి, పోస్ట్ మార్టంలో హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో హత్యకేసుగా నమోదు చేసుకున్నారని అంటున్నారు!

Tags:    

Similar News