విజయవాడ ఎమ్మెల్యేలు హోల్డ్‌లో పడ్డారే.. రీజనేంటి..?
ఈ రెండు స్థానాల్లోనూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు వున్నారు.
వైసీపీకి చెందిన ఇద్దరు విజయవాడ ఎమ్మెల్యేలకు టికెట్లు కన్ఫర్మ్ కాలేదా? వారిని అధిష్టానం హోల్డ్‌లో పెట్టిందా? వేచి చూసే ధోరణిని అవలంబిస్తోందా? అంటే.. తాజా పరిణామాలను బట్టి.. ఔననే అంటున్నా రు పరిశీలకులు. ఏం జరిగిందంటే.. వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేవారి జాబితాను వైసీపీ ఐటీ విభాగం రెడీ చేసి పార్టీ అధిష్టానానికి పంపించినట్టు వార్తలు వచ్చాయి.
దీనిలో సుమారు 85 శాతం మంది సిట్టింగులే ఉన్నారు. మిగిలిన 15 శాతం మాత్రమే కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చారు. ఇదిలావుంటే. విజయవాడలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు స్తానాల్లో వైసీపీ గత ఎన్నికల్లో విజయం దక్కించుకుంది. విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్. ఈ రెండు స్థానాల్లోనూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు వున్నారు.
అయితే.. వచ్చే ఎన్నికల విషయానికి వస్తే.. వీరికే టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే.. వైసీపీ లో ఆల్టర్నేట్ నాయకులు లేరు. అదేసమయంలో వైసీపీకి వీరు విధేయులుగా కూడా ఉన్నారు.
అయిన ప్పటికీ.. తాజాగా ఇచ్చిన వైసీపీ ఐటీ విభాగం వీరి పేర్లు లేకుండా.. నియోజకవర్గాల ముందు డ్యాష్ మార్కు ఉంచి అధిష్టానానికి నివేదిక ఇచ్చింది. దీంతో వీరికి టికెట్లు ఇస్తారా. ఇవ్వరా? అనే చర్చ ప్రారంభమైంది.
అయితే, ఇక్కడ రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకటి వారిపై ప్రజల్లో సానుభూతి కరువైందని ఈ సారి టికెట్ ఇచ్చినా వారు ఓడిపోవడం ఖాయమని వైసీపీ ఐటీ విభాగం గమనించిందని కొందరు చెబుతున్నారు. మరికొందరు.. వారినివారు సరిదిద్దుకునేందుకు ఒక హెచ్చరికగా మాత్రమే ఇలా చేసి ఉంటారని చెబుతున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు నాయకులను హోల్డ్ లో పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.