ఉదయనిధికి నో ప్రమోషన్ అంటున్న స్టాలిన్...!

తాను ఆరోగ్యంగానే ఉన్నాను అంటున్నారు ఈ ఏడు పదులు దాటిన సీనియర్ తమిళ నేత సీఎం.

Update: 2024-01-14 03:47 GMT

తన కుమారుడు డీఎంకే మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ని ఉప ముఖ్యమంత్రిగా చేసే ఆలోచన ఏదీ తనకు లేనే లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం గిట్టని వారు చేస్తున్న ప్రచారం మాత్రమే అని ఆయన అంటున్నారు.

అంతే కాదు తనకు ఆరోగ్యం బాగా ఉందని ఆయన చెప్పుకున్నారు. తన ఆరోగ్యం విషయంలో కూడా వస్తున్న వార్తలు వదంతులను నమ్మరాదని ఆయన కోరుతున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నాను అంటున్నారు ఈ ఏడు పదులు దాటిన సీనియర్ తమిళ నేత సీఎం.

అసలు ఉదయనిధి స్టాలిన్ ని ఉప ముఖ్యమంత్రిగా చేస్తారు అన్న ప్రచారం ఎందుకు వచ్చింది అన్నది కనుక చూస్తే ఈ నెల 21న సేలం లో డీఎంకే యూ వింగ్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ సదస్సులో ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేస్తారు అన్నది పుట్టుకు వచ్చిన న్యూస్. యూత్ వింగ్ కి లీడర్ గా ఉదయనిధి ఉన్నారు. ఆ సదస్సులో సీఎం స్టాలిన్ యూత్ ని ఉత్సాహపరిచే క్రమంలో తన కుమారుడికి ప్రమోషన్ ఇస్తారు అని అంటున్నారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో మరింత కీలకంగా ఉదయనిధి మారేందుకు కూడా ఈ ప్రమోషన్ ఉపయోగపడుతుంది అని లెక్క కట్టారు అని ప్రచారానికి తెర లేచింది. ఇక ఫిబ్రవరిలో స్టాలిన్ విదేశీ పర్యటన ఉందని ఆయన విదేశాల్లో ఉంటే కుమారుడు పాలనా పగ్గాలు చూసుకోవడానికి వీలుగా ఈ ప్రమోషన్ ఉపయోగపడుతుంది అని భావించే ఇలా చేస్తున్నారు అని కూడా చెబుతూ వచ్చారు.

వీటికి మించి ఏడు పదులు దాటిన స్టాలిన్ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని అందుకే ముందుగా డిప్యూటీ సీఎం గా ఉదయనిధిని చేసి ఆనక 2026 ఎన్నికలలో సీఎం అభ్యర్ధిగా ముందుకు తేవాలని పక్కా ప్లాన్ తో అంతా చేస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ ప్రచారంగా ఎంత వేగంగా బయటకు వచ్చాయో అంతే వేగంగా విపక్షాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి.

దాంతోనే ఇపుడు డీఎంకే మాట మార్చిందా అన్న చర్చ కూడా వస్తోంది.ఏది ఏమైనా ఉదయనిధికి డిప్యూటీ సీఎం ఇవ్వకపోయినా ఆయనే తండ్రి తరువాత అంతటి వారు అన్నది అందరికీ తెలిసిందే అని ఆయనే అంతా డీఎంకేకి అక్కడ పరివార్ కే పెద్ద పీట అని విపక్షాలు మళ్లీ గొంతు పెంచుతున్నాయి.

మొత్తానికి నిప్పు లేనిదే పొగ రాదు అని అంటారు. అలా స్టాలిన్ మదిలో కొడుక్కి ప్రమోషన్ ఇవ్వాలని ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల వేళ అది విపక్షాలకు అస్త్రంగా మారకూడదనే ఆ ప్రతిపాదనను వాయిదా వేశారు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News