పసికందు ప్రాణం తీసిన కుక్కలు... హైదరాబాద్ లో మరో విషాదం!
వివరాల్లోకి వెళితే.. షేక్ పేట వినోబానగర్ లో అనూష, అంజి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు
ఇటీవల కాలంలో హైదరాబాద్ లో వీది కుక్కల దాడుల్లో చిన్నారులు బలైపోతున్న సంఘటనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే! ఇందులో ప్రధానంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జీ.హెచ్.ఎం.సీ. మేయర్, మంత్రి కేటీఆర్ తీరుపై రేవంత్ రెడ్డి నిప్పులు కక్కారు.
ఇందులో భాగంగా... కుక్కలకు ఆకలి వేసి బాలుడిని తిన్నాయని మేయర్ చెబుతున్నారని.. మంత్రి ఏమో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తామంటున్నాడంటూ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని.. రోడ్డు మీద కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిందంటూ దుబ్బయట్టారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా హైదరాబాద్ లో కుక్కల దాడిలో పసికందు ప్రాణం పోయింది!
అవును... హైదరాబాద్ లో మరో చిన్నారి వీధికుక్కల దాడిలో గాయపడి మృతిచెందాడు. కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఐదు నెలల పసికందు.. సుమారు 17రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడాడు. ఈ సమయంలో చిన్నారిని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కలేదు. దీంతో విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్ లో కుక్కల దాడిలో మరో పసికందు బలైనట్లయ్యింది.
వివరాల్లోకి వెళితే.. షేక్ పేట వినోబానగర్ లో అనూష, అంజి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 8న వారి ఐదు నెలల తమ కుమారుడిని గుడిసెలో పడుకోబెట్టి పనులకోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. అనంతరం వారు తిరిగి ఇంటికొచ్చి చుసేసరికి కుక్కల దాడిలో తీవ్ర గాయాలతో పసిగుడ్డు ఏడుస్తూ కనిపించాడు.
దీంతో వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు నిలోఫర్ కు అనంతరం ఉస్మానియాకు తరలించారు. ఈ సమయంలో చిన్నారికి శస్త్రచికిత్స చేసిన ఉస్మానియా వైద్యులు... ఎన్.ఐ.సీ.యూ.లో ఉంచారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పసికందు కన్నుమూశాడు. అయితే... చిన్నారిపై మూడు వీధి కుక్కలు దాడి చేసినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు.
దీంతో... జీ.హెచ్.ఎం.సీ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధికుక్కల బెడదను తొలగించడంలో జీ.హెచ్.ఎం.సీ సిబ్బంది విఫలమవుతున్నారని.. అందువల్లే చిన్నారులు కుక్కల దాడిలో తరచూ గాయపడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ సమస్యపై బలంగా గొంతు వినిపించిన రేవంత్ రెడ్డి... ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నారు.