కేసీఆర్‌కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే ఔట్
సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. నాయకులు పార్టీని వీడుతుండటంతో తలనొప్పి తప్పడం లేదు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కారు దిగారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఇలా వరుసగా బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతుండటంతో కేసీఆర్‌కు ఆందోళన తప్పడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికలకు ముందు చేరికలను బీజేపీ ప్రోత్సహిస్తోంది. బీఆర్ఎస్ నేతలను చేర్చుకుంటోంది. ఇప్పుడీ జాబితాలో సుభాష్ రెడ్డి కూడా చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి పోటీ చేసిన సుభాష్ రెడ్డి ఓడిపోయారు. 2018లో విజయం సాధించారు. కానీ 2023లో ఆయనకు కాకుండా బండారు లక్ష్మారెడ్డికి ఉప్పల్ టికెట్‌ను కేసీఆర్ కేటాయించారు. అక్కడ లక్ష్మారెడ్డి గెలిచారు. దీంతో ఎప్పటినుంచో కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న సుభాష్ రెడ్డి సమయం కోసం ఎదురు చూశారు. మల్కాజిగిరి ఎంపీ సీటు ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ వదిలి బీజేపీలో చేరి కేసీఆర్‌కు దెబ్బకొట్టారు.
ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులని చెబుతుంటారు. ఒకప్పుడు కేసీఆర్ ఏదైతే చేసి ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టాలని చూశారో.. ఇప్పుడు అదే ఆయనకు జరుగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్.. రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నుంచి నాయకులను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు 2023 ఎన్నికల్లో ఓడటంతో పరిస్థితి రివర్స్ అయింది. అధికారం లేని బీఆర్ఎస్‌లో ఉండలేక నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు ఇప్పటికప్పుడు కనిపించకపోవడంతో పార్టీ జంప్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కాస్త ఆచితూచి వ్యవహరించింది. మొదట్లో పార్టీలో చేరికలను పెద్దగా ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేరికల పర్వానికి తెరలేపింది. దీంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు.