సుజనాకు లక్కీ చాన్స్ ఉందా...!?

కేంద్ర మంత్రిగా పనిచేసిన వారు మళ్లీ ఎంపీగా వెళ్లాలని చూస్తారు. కానీ ఆయన పేరు ఎంపీ బీజేపీ జాబితాలో ఎక్కడా కనిపించలేదు.

Update: 2024-03-27 17:23 GMT

రాజకీయాల్లో ప్రతీ దశలో లక్ కలసి రావాలి. రెండు సార్లు ఎలాంటి ఆయాసం లేకుండా రాజ్యసభకు వెళ్ళిన సుజనా చౌదరి బీజేపీ టీడీపీ బంధంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన వారు మళ్లీ ఎంపీగా వెళ్లాలని చూస్తారు. కానీ ఆయన పేరు ఎంపీ బీజేపీ జాబితాలో ఎక్కడా కనిపించలేదు.

దానికి నష్టపరిహారం అన్నట్లుగా ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అది కూడా బీసీ జనాభా ఎక్కువగా ఉండే చోట. అలాగే మైనారిటీలు బాగా ఉనికిని చాటుకున్న చోట. ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా పోటీ పడిన సీటు విశాఖ పశ్చిమ. ఈ సీటు కోసం అటు టీడీపీలో ఇటు జనసేనలో చాలా పెద్ద ఎత్తున ఫైటింగ్ సీన్ నడిచింది. విశాఖ పశ్చిమ కోసం చంద్రబాబు నమ్మిన బంటు బుద్ధా వెంకన్న తీవ్ర ప్రయత్నం చేశారు.

ఈసారి తానే పోటీ చేస్తాను అని కూడా అన్నారు. ఆయన తరువాత ఆశపెట్టుకున్నది మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ఆయన కూడా పశ్చిమ సీటు తమదే అన్నారు. మైనారిటీలకు సీటు ఇవ్వాలి కదా అని ఆయన తరఫున వాదన. పైగా 2014లో ఆయన వైసీపీ నుంచి గెలిచి ఉన్నారు. సో అలా ఆయన కర్చీఫ్ వేశారు. కానీ ఆ సీటు పొత్తులోకి మొదట వెళ్ళింది జనసేనకు.

ఇక జనసేనలో విశాఖ పశ్చిమ నుంచి పోతిన మహేష్ ఈ సీటు ఆశించారు. ఆయనకే టికెట్ అని అంతా అనుకున్నారు. పవన్ కి ఎంతో విశ్వాసపాత్రులైన నేత. కానీ ఆయనకు కూడా ఈ సీటు కాకుండా బీజేపీకి వెళ్ళిపోయింది. నిజానికి విజయవాడలో బీజేపీకి ఇవ్వాల్సింది విశాఖ సెంట్రల్ సీటు. గతంలో ఆ సీటు నుంచే కోటా శ్రీనివాసరావు గెలిచారు. అక్కడ బ్రాహ్మిన్స్ తో పాటు చాలా బలమైన వర్గాల మద్దతు బీజేపీకి ఉంది.

కానీ ఆ సీటుకు టీడీపీ నుంచి కీలక నేత బొండా ఉమా ఉన్నారు. దాంతో విశాఖ పశ్చిమను బీజేపీకి సర్దారు. అలా జనసేన టీడీపీ త్యాగాలతో ఈ సీటు కమలానికి దక్కితే దానికి సుజనా చౌదరి అభ్యర్థి అయ్యారు. ఇలా ఎవరో అనుకుంటో ఎవరో ఊహించుకుంటే అసలు ఏమీ అనుకోని సుజనా చౌదరి పశ్చిమకు వచ్చారు.

ఇలా లక్కీగా సీటు దక్కించుకోవచ్చు కానీ గెలవడం సాధ్యమేనా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. మైనారిటీ సీటు, బీసీల సీటు ఇది. దాంతో పాటు వైసీపీకి పట్టు ఉన్న సీటు. ఈ సీటుని మైనారిటీ అభ్యర్ధికే వైసీపీ ఇచ్చింది. ఇపుడు బీజేపీ పోటీ చేయడం వల్ల వైసీపీ వర్సెస్ కూటమి పోరు సాగనుంది.

జనసేన టీడీపీ సహకారాలు అందిస్తే సుజనా చౌదరి విజయం తధ్యమే. కానీ అది ఎంతవరకూ అన్నదే చర్చ. అయితే చంద్రబాబు నమ్మిన బంటు బుద్ధా వెంకన్న ఉన్నారు. ఆయన బాధ్యతలు మొత్తం చూసుకుంటారు అన్న నమ్మకం ఉంది. అలాగే సుజనా చౌదరి ఆర్ధికంగా బలవంతుడు, అంగబలం అర్ధబలం ఆయనకు కలసి వస్తాయని అంటున్నారు. పోతిన మహేష్ కనుక మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే సుజనా ఎమ్మెల్యే అవుతారు అని అంతున్నారు. మొత్తం మీద సుజనా లక్ పవర్ ఎంత అన్నదే ఈ సీటు విషయంలో సాగుతున్న చర్చ.

Tags:    

Similar News