బీజేపీలో ఉండలేక.. టీడీపీలోకి రాలేక.. సుజనా పాట్లు!
2014లో రాజ్యసభకు వెళ్లి.. అటు నుంచి కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు.
టీడీపీ మాజీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయా? ఆయన ఎటూ తేల్చుకోలేక పోతున్నారా? అలాగని తనను తాను సర్దుబాటు చేసుకోలేక పోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.2019 ఎన్నికల వరకు ఆయన టీడీపీలోనే ఉన్నారు . తర్వాత వ్యూహా త్మకంగా ఆయన బీజేపీ బాట పట్టారు. అయితే.. ఇప్పటి వరకు ఆయన లోక్‌సభకు ఎన్నికైంది లేదు. 2014లో రాజ్యసభకు వెళ్లి.. అటు నుంచి కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు.
అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎట్టి పరిస్థితిలోనూ లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన ఇప్పటికే విజయవాడ పార్లమెంటరీ స్థానాన్ని ఎంచుకున్నారు కూడా. ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, విజయవాడలో బీజేపీలో ప్రభావం తక్కువ. దీంతో బీజేపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరాలనేది సుజనా వ్యూహం. దీనికి చంద్రబాబు కూడా అడ్డు పెట్టే పరిస్థితి లేదు.
కానీ, ఎటొచ్చీ.. సుజనా వ్యక్తిగత సమస్యలు.. ఇతర వ్యాపారాల నేపథ్యంలో ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి బయటకు వస్తే. వాటిపై ప్రభావం చూపిస్తుంది. రేపు గెలవకపోతే.. మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొనాలి.. అని ఒకవైపు ఆలోచన చేస్తున్నారు. పోనీ.. బీజేపీ-టీడీపీతో పొత్తు కు రెడీగా ఉందా? అంటే.. దీనిపై ఇంకా అనేక సందేహాలు ముసురుకునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుజనా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఒకవేళ బీజేపీ కనుక టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. విజయవాడ స్తానం నుంచి పోటీ చేసేందుకు కూడా ఇబ్బంది ఉంది. విజయవాడ టికెట్‌ను వదులుకునేందుకు టీడీపీ సిద్దంగా లేదు. ఇప్పటికే కేశినేని చిన్ని ఇక్కడ పాగా వేశారు. వచ్చే ఎన్నికల్లోఈయనకు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీడీపీలోకి వచ్చినా.. తనకు న్యాయం జరుగుతుందా? లేదా? అని ఆయన సతమతం అవుతున్నారు. తాజాగా విజయవాడలోనే మకాం వేసిన సుజనా.. తనకు సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలను కలిసి.. మనసులో మాట చెప్పారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.