చంద్రబాబుకు ఐటీ నోటీసులపై సుజన సంచలన వ్యాఖ్యలు!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) నోటీసులు ఇచ్చిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
లెక్కలు చూపని ఆదాయం రూ.118 కోట్లకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) నోటీసులు ఇచ్చిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా వైసీపీ అనుకూల మీడియా ఈ వార్తను బాగా హైలెట్ చేస్తోంది. సహజంగానే వైసీపీ మంత్రులు, నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి ఆయన అవినీతికి పాల్పడ్డారని.. అదంతా అవినీతి సొమ్మేనని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని తమ సొంత గ్రామం పొన్నవరం విచ్చేసిన ఆయన ‘‘నా భూమి –నా దేశం’’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జనసేనతో పొత్తులపై సుజనా చౌదరి మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ పార్టీ.. పొత్తుల గురించి అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదని వెల్లడించారు. పొత్తులపై అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని తెలిపారు.
చంద్రబాబుకి ఐటీ నోటీసుల విషయం తనకు తెలియదన్నారు. నోటీసులిచ్చింది తనకు కాదని.. కాబట్టి ఈ విషయం ఆయననే అడగాలని సూచించారు. తాను కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు నోటీసు రాలేదు కదా అని గుర్తు చేశారు. జమిలి ఎన్నికలకు వెళ్ళే విషయంపై మాట్లాడుతూ కొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీపైనా సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో అందరికీ చెప్పే పోటీ చేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా సుజనా పోటీ చేసే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. త్వరలో ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తాయని తనకు నమ్మకం ఉందన్నారు.
చంద్రబాబుకు అనుకూలంగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పనిచేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సుజన ఖండించారు. ఇలాంటి ప్రచారాలు చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురందేశ్వరి చంద్రబాబు కోసం పనిచేస్తుందనే వారు ఆధారాలు బయటపెట్టాలని కోరారు.
నా భూమి – నా దేశం.. నేల తల్లికి నమస్కారం.. వీరులకు వందనం అనే ప్రత్యేక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టామని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో వీటిని చేపట్టారని వెల్లడించారు. దేశ సంక్షేమం కోసం ప్రాణ త్యాగాలు చేసిన స్థానిక మహనీయులు, సాహసవంతులు, వీరులను స్మరించుకోవాల్సి ఉందన్నారు. ‘‘నా భూమి - నా దేశం’’ కేవలం ఒక కార్యక్రమం కాదని.. దేశ భవిష్యత్తుతో ప్రజలు తాము అనుసంధానం చేసుకునే సాధనమని చెప్పారు.