కేటీఆర్ భేషరతుగా సారీ చెప్పాలంటూ సుకేశ్ లీగల్ నోటీసులు

Update: 2023-08-02 04:46 GMT

మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి.. మండోలి జైల్లో ఉంటున్న ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. సంచలన వ్యాఖ్యలు చేసే ఆయన.. ఆ మధ్యన ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి.. అందునా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత మీద సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. అదే సమయంలో కేసీఆర్ ఫ్యామిలీ ఇరుకున పడేలా ఆయన విడుదల చేసిన లేఖలు షాకింగ్ గా మారటం తెలిసిందే.

వీటిపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రియాక్డు అవుతూ.. సుకేశ్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఆయన్ను ఉద్దేశించి రోగ్.. నోటెడ్ క్రిమినల్.. ఫ్రాడ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై తాజాగా సుకేశ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని భేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు సుకేశ్.

రోగ్.. క్రిమినల్.. ఫ్రాడ్ అంటూ చేసిన వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయన్న సుకేశ్.. రాజకీయాల్లోనూ.. సినిమా రంగంలోనూ తనకు మంచి పేరు ఉందన్నారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల కారణంగా ఆయా సర్కిల్స్ లో తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని పేర్కొన్నారు. తాను పంపిన నోటీసులకు వారం లోగా స్పందించాలని.. తనపై చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలన్న సూచన చేశారు. ఒకవేళ తనకు సారీ చెప్పకుంటే మాత్రం తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటివరకు తాను లీగల్ నోటీసులు పంపటమే కానీ.. తన మాటలకు లీగల్ నోటీసులు మంత్రి కేటీఆర్ అందుకోవటం చాలా అరుదైన అంశంగా అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News