ఎట్టకేలకు నెగ్గిన సర్కారు పంతం.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై వేటు
సీఐడీ మాజీ డీజీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమారుపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లారనే ఆరోపణలపై విచారణ జరిపిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.;
సీఐడీ మాజీ డీజీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమారుపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లారనే ఆరోపణలపై విచారణ జరిపిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. సునీల్ కుమార్ పై వచ్చిన ఆరోపణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిపోడియాతో ప్రభుత్వం విచారణ జరిపింది. ఆ విచారణలో సునీల్ కుమారుపై వచ్చిన అభియోగాలు నిజమని తేలడంతో సస్పెండ్ చేశారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల కళ్లల్లో ఆనందం చూడటానికి అంటూ రఘురామరాజును అరెస్టు చేసి కస్టడీలో వేధించారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం ఎస్పీ ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సునీల్ కుమార్ ఐపీఎస్ సర్వీస్ రూల్స్ ను పాటించలేదనే ఆరోపణలతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం, ట్రావెల్ ప్లాన్ కు విరుద్ధంగా విదేశాల్లో ఉండటంపై సునీల్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై విచారించిన కమిటీ నివేదిక ప్రకారం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
తాను చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినా, సునీల్ కుమారును సస్పెండ్ చేయలేదని రఘురామ ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేయడమే కాకుండా కస్టడీలో చట్ట వ్యతిరేకంగా తనపై దాడి చేశారని రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో విచారణకు రమ్మంటూ సునీల్ కుమారుకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సునీల్ ను వేరే అభియోగాలు మోపి సస్పెండ్ చేయడం గమనార్హం.