రేపటితో పదవికాలం ముగింపు.. అంతలోనే బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన మేయర్

బీఆర్ఎస్ పార్టీకి మేయర్ సునీల్ రావు గుడ్ బై చెప్పేశారు. ఆయనతోపాటే మరో పది మంది కార్పొరేటర్లు ఈ రోజు బీజేపీ గూటికి చేరుతున్నారు.

Update: 2025-01-25 06:42 GMT

బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయి.. పలు చోట్ల కేడర్‌ను కోల్పోయి ఆ పార్టీ సతమతం అవుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది.

రేపటితో రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం ముగియబోతోంది. అందులో కరీంనగర్ కార్పొరేషన్ సైతం ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి అక్కడ గులాబీ జెండానే ఎగురుతోంది. గత రెండు పర్యాయాలు కూడా బీఆర్ఎస్‌కు చెందిన నేతలే మేయర్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం వై.సునీల్ రావు మేయర్‌గా కొనసాగుతున్నారు. అయితే.. ఈ పాలకవర్గం పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ఆయన ఊహించని షాక్ ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీకి మేయర్ సునీల్ రావు గుడ్ బై చెప్పేశారు. ఆయనతోపాటే మరో పది మంది కార్పొరేటర్లు ఈ రోజు బీజేపీ గూటికి చేరుతున్నారు. మరో గంటలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన రాజీనామా లేఖను సైతం పంపించారు. మరోవైపు.. ఆయన పార్టీ మారకుండా పార్టీలోని కీలక నేతలు బుజ్జగించినా ప్రయత్నాలు విఫలం అయినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆయనను సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ అందుబాటులోకి రాలేదని సమాచారం.

ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు 12 మంది కార్పొరేటర్లు.. బీజేపీకి 12 మంది కార్పొరేటర్లు.. ఎంఐఎంకు ఏడుగురు.. బీఆర్ఎస్‌కు 29 మంది ఉన్నారు. ఇవాళ మేయర్‌తో పాటు మరో పది మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరుతుండడంతో బీఆర్ఎస్ సంఖ్య మరింత తగ్గనుంది. అయితే.. పది మంది కార్పొరేటర్లు చేరుతున్నారని ప్రచారం జరుగుతున్నా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

కార్పొరేటర్లు సైతం పార్టీని వీడుతున్నారని తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారితో సమావేశం అయ్యారు. పార్టీ మారకుండా ఉండేలా వారితో చర్చలు జరిపారు. కొంతమంది తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిసింది. కొంత మంది మాత్రం వెళ్లేందుకే సిద్ధపడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. గత పార్లమెంట్ ఎన్నికల వేళ నుంచే సునీల్ రావు పార్టీకి అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. అప్పటి నుంచే ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా అది నిజమైంది.

Tags:    

Similar News