సీట్లు-స‌మోసా.. ఇండియా కూట‌మిపై వ్యంగ్యాస్త్రాలు!

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సుమారు 18 పార్టీలు క‌లిసి ఏర్పాటు చేసుకున్న 'ఇండియా' కూట‌మి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి

Update: 2023-12-20 18:13 GMT

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సుమారు 18 పార్టీలు క‌లిసి ఏర్పాటు చేసుకున్న 'ఇండియా' కూట‌మి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఈ కూట‌మిలో ఉన్నామ‌ని చెబుతున్న పార్టీలే.. ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వాస్త‌వానికి కేంద్రంలో న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింపాల‌న్న ఏకైక అజెండాతో ఇండియా కూట‌మి ఏర్ప‌డింది. అయితే.. ఆది నుంచి ఈ కూట‌మి.. పెద్దగా మోడీపై ప్ర‌భావం చూపించ‌లేక పోతోంద‌నే వాద‌న ఉంది.

ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానమైన హిందీ బెల్ట్‌లో ఉన్న రాజస్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దే శ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చింది. దీంతో మ‌రింత ఉమ్మ‌డిగా ముందుకు సాగాల‌ని ఇండియా కూట‌మి పార్టీలు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఇండియా కూటమి నాలుగో సమావేశం జ‌రిగింది. అయితే.. ఈ స‌మావేశంలో వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌లకు సంబంధించిసీట్ల షేరింగ్ అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించాల‌ని ప‌లు ప్రాంతీయ పార్టీలు భావించాయి.

కానీ, తాజాగా జ‌రిగిన నాలుగో స‌మావేశంలో కూడా.. సీట్ల షేరింగ్ అంశం ప్ర‌స్తావ‌న‌కు రాలేదు. దీంతో ఇది పార్టీల‌కు అసంతృప్తి క‌ల్పించింది. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన ఇండియా కూట‌మి భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) ఎంపీ సునీల్ కుమార్ పింటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''సమోసా లేకుండా ఇండియా బ్లాక్ సమావేశం ముగిసింది'' అంటూ చమత్కరించారు. సమావేశంలో చెప్పుకోదగిన చర్చేమీ జరగలేదన్నారు.

'కూటమి సమావేశంలో సీట్ల షేరింగ్‌పై చర్చించాల్సి ఉంది. అయితే అది జరగలేదు. కూటమి పార్టీలకు చెందిన బడా నేతలందరూ వచ్చారు. అయితే చర్చనీయాంశంపైనే చర్చ జరుగలేదు. కాంగ్రెస్ పార్టీ టీ, బిస్కట్లకే పరిమితం చేసింది. ఎందుకంటే నిధుల కొరత ఉందని ఇటీవలే కాంగ్రెస్ చెప్పింది. రూ.138, రూ1,380, రూ.13,000 చొప్పున డొనేషన్లు కోరింది. ఇంకా డొనేషన్లు రాలేదు. అందువల్లే సమోసా లేకుండా టీ, బిస్కట్లతో సరిపెట్టేశారు. ఏ సీరియస్ అంశంపైన చర్చ జరపకుండా ముగించేశారు'' అని సునీల్ కుమార్ పింటూ చెప్పారు.

ఇదిలావుంటే, డిసెంబర్ 22న దేశవ్యాప్త నిరసనకు ఇండియా కూట‌మి పార్టీలు నిర్ణ‌యించాయి. అదేస‌మ‌యంలో అన్ని పార్టీలూ సంయుక్త ర్యాలీలు నిర్వహించాలనే ప్రతిపాదనలు సమావేశంలో వ్య‌క్త‌మ‌య్యాయి.

Tags:    

Similar News