అవినాష్ వర్సెస్ సునీత.. వివేకా కేసులో పరస్పర ఆరోపణలు
ఒకవైపు న్యాయం పోరాటం చేస్తున్న వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. మరోవై పు.. ఎన్నికల ప్రచారంలోనూ దీనిని ప్రధాన వస్తువుగా చేసుకుని మాటల తూటాలు పేలుస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు వ్యవహారం.. కీలకమైన సార్వత్రిక ఎన్నిక లకు ముందు అనేక మలుపులు తిరుగుతోంది. ఒకవైపు న్యాయం పోరాటం చేస్తున్న వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. మరోవై పు.. ఎన్నికల ప్రచారంలోనూ దీనిని ప్రధాన వస్తువుగా చేసుకుని మాటల తూటాలు పేలుస్తున్నారు. హత్యకు కర్త, కర్మ క్రియ అంతా కూడా.. ఎంపీ అవినాషేనని.. హైదరాబాద్ కేంద్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దంచి కొట్టిన ఆమె.. తర్వాత కూడా తన వ్యాఖ్యల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిని ప్రజలు ఓడించాలని పిలుపునిస్తున్నారు.
అంతేకాదు.. హంతకులను కాపాడుతున్న సీఎం జగన్‌కు అధికారం దక్కకుండా చేయాలని కూడా ప్రజలకు పిలుపునిస్తున్నా రు. అయితే.. ఈ విషయంపై ఇప్పటి వరకు ఒకటి రెండు సార్లు మాత్రమే స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి.. తాజాగా సునీతపై విమర్శలు గుప్పించారు. ఈ కేసులో గొడ్డలి కొనుక్కురావడం నుంచి వేటు వేయడం వరకు కీలకంగా(అతనే చెప్పిన దాని ప్రకారం) వ్యవహరించిన దస్తగిరి .. తర్వాత అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన బెయిల్‌పై ఉన్నారు. అంతేకాదు.. పులివెందులలో ఓ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
అయితే.. అసలు గొడ్డలితో నరికి చంపానని చెబుతున్న ఈ దస్తగిరితో వివేకా కుమార్తె సునీత లాలూచీ పడ్డారని.. తాజాగా అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. సునీత తనపై కావాలనే కుట్రలు చేస్తున్నారని.. దీనివెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఇదేసమయంలో సునీత తన తండ్రిని చివరి రోజుల్లో నానా నరకం పెట్టారని కూడా చెప్పారు. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉన్న అవినాష్ రెడ్డి.. తనకు ఏ పాపం తెలియదని చెప్పారు. నిజం నిలకడమీద తెలుస్తుందన్నారు. గూగుల్ టేక్ అవుట్‌లు కల్పితమని అన్నారు.
సునీత కౌంటర్..
కానీ, అవినాష్ రెడ్డి చేసిన విమర్శలు, వ్యాఖ్యలపై సునీత కూడా రియాక్ట్ అయ్యారు. నిజంగానే తనకు ఏ పాపం తెలియక పోతే.. తన ఫోన్‌ను సీబీఐకి అప్పగించాలని గట్టి సవాలే విసిరారు. అంతేకాదు.. ``గూగుల్ టేకౌట్ కల్పితం అంటున్నారు. గూగుల్ టేకౌట్ రిపోర్టును రూపొందించింది సీబీఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఫోరెన్సిక్ ల్యాబ్`` అని సునీత వెల్లడించారు. ఈ సంస్థలకు అవినాష్ రెడ్డిపై ఏమైనా కోపం ఉంటుందా? అని అన్నారు. అంతేకాదు.. . చివరి రోజుల్లో మేం వివేకాను వదిలేశాం అని ప్రచారం చేస్తున్నారని.. ఇది నిజం కాదని సునీత చెప్పారు. తన భర్త రాజశేఖర్ రెడ్డి, వివేకా కలిసి కొరియా పర్యటనకు వెళ్లారని తెలిపారు.