రజనీ దండం...కాషాయానికా. కమలానికా...?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న స్టార్ డం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న స్టార్ డం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏడు పదులు దాటిన వయసులో కూడా జైలర్ మూవీతో లేటెస్ట్ గా భారీ హిట్ కొట్టారు. ఇదిలా ఉండగా రజనీ కాంత్ ఏమి చేసినా ఆయన ఫ్యాన్స్ కి నచ్చుతుంది. కానీ సోషల్ మీడియా అన్నది బలంగా ఉన్న ఈ కాలంలో వారూ వీరూ అని చూడకుండా ట్రోలింగ్ చేయడమే అతి పెద్ద పనిగా మారింది.
అలా లేటెస్ట్ గా రజనీ కూడా బీభత్సంగా ట్రోల్స్ కి గురి అవుతున్నారు. ఆయన చేసిన పని ఇంతకీ ఏంటి అంటే యూపీ సీఎం గా ఉన్న ఆదిత్యా నాధ్ యోగీజీ కాళ్ళకు వంగి మరీ దండం పెట్టారు. ఇక్కడ రజనీ స్టాటస్. స్టార్ డం ని ఆయన ఏజ్ ని గుర్తుకు తెచ్చి నెటిజన్లు గట్టిగా ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే రజనీ ఫ్యాన్స్ మాత్రం ఇది రజనీ భక్తితో చేసిన పని అని అంటున్నారు. ఎపుడో రెండు దశాబ్దాల క్రితమే యోగి ఆదిత్యనాధ్ యోగిగా మారారని, ఆయనకు గోరఖ్ పూర్ లో ఒక మఠం ఉందని కూడా గుర్తు చేస్తున్నారు. మఠాధిపతులను గౌరవైంచడం సంప్రదాయం అని ఆ విధంగానే రజనీ కాంత్ చేశారు అని అంటున్నారు.
అయితే తమిళనాట సూపర్ స్టార్ అయిన రజనీ ఆ విధంగా చేయడం తమిళులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు. తమిళుల ఆత్మగౌరవం అన్న ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. నార్తూ సౌతూ పోల్స్ ని కూడా ప్రస్తావనకు తెస్తున్నారు. నిజంగా చూస్తే రజనీ చేసింది భక్తితో తప్ప మరేమీ కాదు అని అంటున్న వారు ఉన్నారు. కానీ హిందీ బెల్ట్ కి చెందిన యూపీ సీఎం బీజేపీ నేతకు రజనీ దండం పెట్టడం అంటూ రాజకీయాన్ని ముందుకు తెస్తున్నారు.
అయితే రజనీ రాజకీయాలకే దండం పెట్టేశాక అక్కడ ఉన్నది బీజేపీ సీఎం నా లేక మరొకరా అన్న ప్రశ్న తలెత్తుతుంది అని అంటున్నారు. రజనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. ఆయన చాలా మంది యోగులను గురువులను కలసి అభివాదం చేశారని అంటున్నారు.
అయితే ఆ యోగులు వేరు యూపీ సీఎం గా ఉన్న యోగీ వేరు అని అంటున్నారు. ఆయన రాజకీయాల్లో ఉండడమే ఇపుడు అతి పెద్ద రచ్చకు కారణం అవుతోంది అని అంటున్నారు. ఇక రజనీని బీజేపీ సింపతైజర్ గా కూడా లెక్క వేసే వారు ఉన్నారు. ఆయన అప్పట్లో బీజేపీ ప్రోత్సాహంతోనే పార్టీ పెట్టడానికి రెడీ అయి ఆ తరువాత విరమించుకున్నారని అంటున్నారు.
ఏది ఏమైనా రజనీ దండం పెట్టింది కాషాయానికే అంటున్నారు ఆయన అభిమాన వర్గం. అయితే బీజేపీది కూడా కాషాయం కాబట్టి ఆయన ఆ కాషాయనికి దండం పెట్టారని మరి కొందరు అంటున్నారు. యోగీ ఆదిత్య నాధ్ బీజేపీలో బిగ్ ఫిగర్. ఆయన రేపటి ప్రధానిగా రేసులో ఉన్న వారు. అన్నీ అనుకూలించినట్లు అయితే 2024లోనే ప్రధాని అయినా అవుతారు అన్న టాక్ ఉంది.
మరి ఆయన ప్రధాని అవుతారని తెలిసే రజనీ దండం పెట్టారా అన్నది మరో వాదన. ఏది ఏమైనా ఆదిత్యానాధ్ ఆధునిక యోగి, రాజకీయ యోగి, బీజేపీ యోగి. రజనీ దండం పెట్టినది ఆధ్యాత్మికతకు గోరఖ్ పూర్ పీఠం కారణం కావచ్చు కానీ ఆదిత్యనాధ్ ఉంటున్నది సీఎం గా. సీఎం ఆఫీసులో. సో రజనీ దండం వెనక భక్తి ఉన్నా దానికి రాజకీయం, తమిళుల సెంటిమెంట్, భాష, భావం, రంగు రుచి అన్నీ రంగరించి నెటిజన్లు కడిగేస్తున్నారు. మొత్తానికి జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన రజనీ ఒకే ఒక దండంతో ఇలా ట్రోలింగ్ కి గురి అయ్యారు. కాషాయం ఎంత పని చేసిందో మరి.