అమెరికా మళ్లీ మహిళను ఓడగొట్టిందా?

ఈ సందర్భంగా హారిస్ పరాజయంపై పలువురు కన్నీరు పెట్టుకుంటున్నారు.

Update: 2024-11-06 09:25 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో.. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ లో తన మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఆయన మద్దతు దారులు సంబరాల్లో ఉన్నారు.

మరోపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓడిపోవడంతో ఆమె మద్దతుదారులు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. వాస్తవానికి ఈ రోజు రాత్రి హోవార్డ్ యూనివర్సిటీలోని ఎలక్షన్ నైట్ పార్టీలో ఆమె మాట్లాడాల్సి ఉంది. అయితే... ఆమె ప్రసంగం ఉండబోదని ఆమె ప్రచార టీం మెంబర్ రిచ్మండ్ తెలిపారు.

దీంతో... హోవార్డ్ యూనివర్శిటీలోని హాల్ లో ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ సందర్భంగా హారిస్ పరాజయంపై పలువురు కన్నీరు పెట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిగా మహిళల ఓటమిపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.

అవును... 2016లో హిల్లరీ క్లింటన్ ఓడిపోయిన ఘటనను 2024 ఎన్నికల్లో హారిస్ పరాజయంతో పోలుస్తున్నారు పరిశీలకులు. 2016 ఎన్నికల్లో ట్రంప్.. హిల్లరీ క్లింటన్ ను ఓడించారు. ఆ ఎన్నికల్లో రాజకీయ పండితుల అంచనాలు తారుమారు చేస్తూ ట్రంప్ 306 ఎలక్టోరల్ ఓట్లతో ఎలక్టోరల్ కాలేజీని గెలుపొందారు.

ఆ ఎన్నికల్లో వైట్ హౌస్ ను కైవసం చేసుకునే విషయంలో హెవీ ఫేవరెట్ గా భావించిన క్లింటన్ కు 227 ఓట్లు మాత్రమే వచ్చి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు హారిస్ కు అదే పరిస్థితి. ఇదే సమయంలో అప్పట్లోనూ హిల్లరీ క్లింటన్... ఎలక్షన్ నైట్ పార్టీకి గౌర్హాజరవ్వగా, ఇప్పుడు హారీస్ అ దిశగానే ఫిక్సయ్యారు!

ఈ పరిణామా నేపథ్యంలో... మెజారిటీ అమెరికన్లు తమ దేశానికి ప్రెసిడెంట్ గా మహిళ ఉండటాన్ని అంగీకరించరా.. ప్రోత్సహించరా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో... మహిళా వ్యతిరేకి అంటూ డొనాల్డ్ ట్రంప్ పై కథనాలు మొదలైపోయాయి! మిలియన్ల కొద్దీ అమెరికన్ పురుషులు.. డొనాల్డ్ ట్రంప్ ను పురుష బలానికి ప్రతిరూపంగా చూస్తున్నట్లు ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో... సోషల్ మీడియా, టీవీ షోలలో మహిళలను అవమానించడం, కించపరచడం వంటి పనులకు పాల్పడిన చరిత్ర ఉందని.. మహిళల పునరుత్పత్తి ఎంపికలను కూడా ట్రంప్ అవమానిస్తారని.. కనీసం 26 మంది మహిళలు అతనిపై లైంగిక దుష్ప్రవర్తన, వేధింపుల ఆరోపణలు చేశారని చెబుతున్నారు. ట్రంప్ గెలుపు మహిళ కు చెడు వార్త అని నొక్కి చెబుతున్నారు.

ఏది ఏమైనా... ప్రచార సీజన్ లో "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" (ఎంఏజీఏ) ఉద్యమం.. హారిస్ ను అధ్యక్షురాలిగా ఎన్నుకోకూడదని వాదించినట్లు అనిపించిందని అంటున్నారు. ఒక మహిళగా, ఆమె నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉందని.. బలమైన, పౌరుషం గల అమెరికా దేశానికి నాయకత్వం వహించడానికి ఆమె సరైన ఆప్షన్ కాదని అమెరికన్స్ భావించారంటూ ఆమె మద్దతుదారులు స్పందిస్తున్నారు! ఫైనల్ గా అమెరికా మరోసారి మహిళను ఓడగొట్టిందని నొక్కి చెబుతున్నారు!

Tags:    

Similar News