ఆరునెలలు పైబడిన గర్భ విచ్ఛిత్తి... సుప్రీంకోర్టులో కీలక పరిణామం!
అవును... అబార్షన్ కు సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
26 వారాల అబార్షన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక వివాహిత ఆరు నెలల పైబడిన గర్భాన్ని అబార్షన్ చేయడానికి ఒక రోజు క్రితం సుప్రీంకోర్టులోని ఒక ధర్మాసనం ఆమోదం తెలిపింది. అయితే, మర్నాడే ఆ ఆదేశాలను నిలిపివేస్తూ మరో ధర్మాసనం తీర్పునిచ్చింది. మాత, శిశు ప్రాణాలపై వైద్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ అబార్షన్ ను ప్రస్తుతానికి నిలిపివేయాలని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. దీంతో ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారబోతోంది!
అవును... అబార్షన్ కు సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 26 వారాల గర్భస్థశిశువు బతికే అవకాశాలు బలంగా ఉన్నాయంటూ వైద్య బృందం ఇచ్చిన తాజా నివేదికపై సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది. గతంలో గర్భ విచ్ఛిత్తికి అనుమతివ్వగా.. తాజాగా గర్భస్థ శిశువు బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంపై సుప్రీంకోర్టు స్పందించింది. పిండం గుండె చప్పుడును ఆపాలని ఏ కోర్టు చెబుతుందని ఘాటుగా ప్రశ్నించింది.
వివరాళ్లోకి వెళ్తే... ఓ వివాహిత ఇటీవల అబార్షన్ నిమిత్తం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న ఆమె తన అబార్షన్ కు అనుమతించాలని కోరింది. ఇందులో భాగంగా... మూడో చిన్నారిని పెంచేందుకు ఆర్థికంగా, మానసికంగా సిద్ధంగా లేనని పిటిషన్ లో పేర్కొంది.
దీంతో స్పందించిన దేశ అత్యున్నత న్యాయస్థానం... ఎయిమ్స్ వైద్యుల నివేదిక మేరకు ఆ వివాహిత అబార్షన్ కి అక్టోబర్ 9న అనుమతిచ్చింది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలపై కేంద్రం స్పందించింది. గర్భాన్ని తొలగించినప్పటికీ శిశువు బతికే అవకాశాలుంటాయని, అందుకే అబార్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. అబార్షన్ ను టెంపరరీగా పోస్ట్ పోన్ చేయాలని అక్టోబర్ 10న ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా ఈ కేసును జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీం ధర్మాసనానికి సిఫార్సు చేయగా.. బుధవారం విచారణ చేపట్టింది.
ఇందులో భాగంగా... వైద్యులు ఇచ్చిన తాజా నివేదిక పట్ల సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో... గర్భస్థ శిశువు బతికి ఉండే అవకాశాల గురించి ఇంత కచ్చితంగా అప్పుడెందుకు చెప్పలేకపోయారంటూ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ని సూటిగా ప్రశ్నించింది. జీవం ఉన్న గర్భస్థ శిశువు గుండె చప్పుడును ఆపాలని ఏ కోర్టు చెబుతుంది, ఎవరూ చెప్పరు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో సదరు మహిళ, ఆమె భర్తతో వర్చువల్ గా మాట్లాడిన ధర్మాసనం... తాజా నివేదికలోని అంశాలను ఆ దంపతులకు వివరించింది. అవన్నీ విన్న తర్వాత తదుపరి నిర్ణయాన్ని చెప్పాలని ఆ మహిళ తరఫున పిటిషనర్ కు సూచించింది. అయినప్పటికీ ఆ మహిళ తన గర్భాన్ని కొనసాగించడానికి అంగీకరించలేదు. ఇదే సమయంలో ఈమె నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.
ఇలా ఈ అబార్షన్ విషయంలో సుప్రీం ద్విసభ్య ధర్మాసనంలోనూ ఏకాభిప్రాయం రాలేదు. దీంతో... చివరకు ఈ కేసును విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలని సీజేఐకి సూచించింది.