సుప్రీం తాజాగా చేసిన ప్రశ్న.. పలు రాష్ట్ర ప్రభుత్వాలకు చురుకు పక్కానట

ఈ సందర్భంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టింది. అంతేకాదు.. అల్టిమేటం జారీ చేసింది.

Update: 2023-11-22 05:05 GMT

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఆర్ఆర్ టీఎస్ కారిడార్ కు నిధుల విడుదలలో ఢిల్లీ సర్కారు జాప్యం చేయటాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీం చేసిన తాజా వ్యాఖ్యలు ఒక్క ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారుకే కాదు.. దేశంలోని పలు ప్రభుత్వాలకు చర్నాకోలు దెబ్బలా తగులుతుందని చెప్పక తప్పదు. ఇంతకూ జరిగిందేమంటే..

రీజినల్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టం కోసం ఢిల్లీ ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులపై జాప్యం చేసింది. అదే సమయంలో ఢిల్లీ రాష్ట్ర సర్కారు పబ్లిసిటీ కోసం.. పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనల్ని ఇవ్వటాన్ని తప్పు పట్టింది. రైల్ ట్రాన్సిట్ సిస్టం కోసం ఢిల్లీ ప్రభుత్వం నిధుల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ.. సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. దీన్నిసుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది.

ఈ సందర్భంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టింది. అంతేకాదు.. అల్టిమేటం జారీ చేసింది. నవంబరు 28 లోపు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆర్ ఆర్ టీఎస్ ప్రాజెక్టుకు నిదులు కేటాయించని వైనాన్నిప్రశ్నించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల కోసం మూడేళ్లలో రూ.1100కోట్లు ఖర్చు చేయగలిగినప్పుడు.. మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన ప్రాజెక్టుకు రూ.415 కోట్లు ఎందుకు కేటాయించలేదు? అని ప్రశ్నించింది. ఈ ఏడాది సైతం ఢిల్లీ ప్రభుత్వం ప్రకటనల కోసం రూ.550 కోట్ల నిధుల్ని విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించింది.

రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా పర్యావరణానికి మేలు కలిగే ప్రాజెక్టుకు ఆటంకం కలగటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. గతంలో ఈ కేసు విషయంలోనిధులు విడుదల చేస్తామని చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందని పేర్కొన్నారు.గతంలో హైకోర్టుకు చెప్పిన కమిట్ మెంట్ ను పూర్తి చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను నవంబరు 28కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సుప్రీం చేసిన వ్యాఖ్యలతో ఢిల్లీ సర్కారు ఏ తీరులో స్పందిస్తుందో చూడాలి. దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారపక్షానికి చెందిన వారందరికి చురుకు పుట్టేలా చేసిన సుప్రీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News