స్వలింగ సంపర్కాల వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది
స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ మేరకు కీలక తీర్పు ప్రకటించింది. స్వలింగ సంపర్కాలకు దేశంలో ఇంతవరకు గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో స్వలింగ సంప్కరాలను గుర్తించాలని 23 గే, లెస్బియన్స్ జంటలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అభిప్రాయాన్ని వీడాలని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని కోర్టు అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజులు పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి.. మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. తాజాగా తన తీర్పును ప్రకటించింది.
వివాహ వ్యవస్థ అనేది 'స్థిరమైనదని, దాన్ని మార్చలేమని' అనుకోవడం సరికాదని కోర్టు తెలిపింది. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే.. మనం మళ్లీ స్వాతంత్రపు పూర్వపు స్థితికి వెళ్లినట్లేనని పేర్కొంది. అయితే, ప్రత్యేక వివాహ చట్టం అవసరమా లేదా అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని వెల్లడించింది. దీని చట్టపరిధిలోకి కోర్టు వెళ్లాలనుకోవట్లేదని వ్యాఖ్యానించింది.
లైంగిక ధోరణి కారణంగా ఆ వ్యక్తులు బంధంలోకి వెళ్లే హక్కును నియంత్రించకూడదని సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
వివాహేతర జంటలతో పాటు స్వలింగ సంపర్కం చేసే జంటలు కూడా బిడ్డలను దత్తత తీసుకోవచ్చని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. భిన్న లింగాల జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని భావించనక్కరలేదన్నారు.
ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు అధికారాల విభజనకు అడ్డంకి కాదని చెప్పారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపిన సీజేఐ.. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని స్పష్టం చేశారు.
ప్రత్యేక వివాహాల చట్టంలోని సెక్షన్ 4 రాజ్యాంగ విరుద్ధం అనొచ్చని సీజేఐ చంద్రచూడ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్‌కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై సుప్రీంకోరు తీర్పును మే 11న రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.
కాగా, 2018 సెప్టెంబర్ లోనే సుప్రీంకోర్టు.. స్వలింగ సంపర్కం శిక్షార్హం కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పాతకాలపు చట్టాన్ని పక్కనపెట్టి ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సాంస్కృతిక విలువలకు తిలోదకాలిచ్చి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటూ, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ విమర్శలు రేగాయి.
కాగా స్వలింగ సంపర్కం తప్పు కాదని అత్యున్నత న్యాయస్థానమే చెప్పినా తమకు సామాజిక అంగీకారం లభించడం లేదనీ, తమపై దుర్విచక్షణ సాగుతూనే ఉందనీ లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ల వర్గం ఆరోపణలు చేస్తోంది.
వాస్తవానికి హోమో సెక్సువల్ పెళ్ళిళ్ళను చట్టబద్ధమైనవని గుర్తించాలని కోరుతూ 2020లోనే ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తర్వాత సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా కోరింది.
ఈ నేపథ్యంలో మార్చి 13న సుప్రీంకోర్టులో కేంద్రం తన అఫిడవిట్ దాఖలు చేస్తూ స్వలింగ వివాహాల చట్టబద్ధతకు ఒప్పుకోలేదు. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలు శిక్షార్హమని భారత శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్ పేర్కొంటోందని గుర్తు చేసింది. అలాగే ఆ సెక్షన్ కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని ఐదేళ్ల క్రితం తీర్పునిచ్చినంత మాత్రాన ఏకంగా స్వలింగ వివాహాన్ని వివిధ చట్టాల కింద తమ ప్రాథమిక హక్కని పిటిషనర్లు అనుకోరాదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. స్వలింగ వివాహాలు సమాజంలో కొత్త సమస్యను సృష్టిస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది.