కేంద్రం సంచలన నిర్ణయం.. పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే ఇక అంతే!

ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ తాజాగా లోక్‌ సభలో ప్రవేశపెట్టారు.

Update: 2024-02-05 12:29 GMT

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలపై పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు పోటీ పరీక్షల్లో అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ ఫెయిర్‌ మీన్స్‌) బిల్లును సోమవారం లోక్‌ సభలో ప్రవేశపెట్టింది. దీనికింద పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధిస్తారు. ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ తాజాగా లోక్‌ సభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం పడనుంది. వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులకు కూడా కఠిన శిక్షలు విధిస్తారు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రం తాజా బిల్లును లోక్‌ సభలో ప్రవేశపెట్టింది.

కాగా కంప్యూటరైజ్డ్‌ పరీక్షల ప్రక్రియను మరింత సురక్షితంగా మార్చే దిశగా సిఫార్సుల నిమిత్తం ఒక ఉన్నతస్థాయి జాతీయ సాంకేతిక కమిటీ ఏర్పాటు అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బిల్లులో చేర్చింది. ప్రభుత్వ పరీక్షల విధానంలో పారదర్శకత, విశ్వసనీయతను తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.

అదేవిధంగా నిజాయతీతో విద్యార్థులు చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందని, తమ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని యువతకు భరోసా ఇవ్వడమే కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బిల్లు ఉద్దేశం. ఈ బిల్లు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని తెస్తోందనే విమర్శల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. తాజా బిల్లు లక్ష్యం విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తెచ్చింది కాదని స్పష్టం చేసింది.

కాగా జనవరి 31న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో ఈ బిల్లు గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పరీక్షల్లో అవకతవకల విషయంలో యువత ఆందోళన ప్రభుత్వానికి తెలుసని రాష్ట్రపతి తెలిపారు. పోటీ పరీక్షల్లో అవకతవకలపై కఠినంగా వ్యవహరించేందుకు ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా బిల్లును ప్రవేశపెట్టింది.

 

Tags:    

Similar News