మన పార్లమెంటులో మాటలే.. అక్కడ ఎంపీలు కొట్టేసుకున్నారు!
మన దేశ పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష నాయకులు సృష్టించే గందరగోళం చూస్తే.. మనకు కంపరం వేస్తుంది.
మన దేశ పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష నాయకులు సృష్టించే గందరగోళం చూస్తే.. మనకు కంపరం వేస్తుంది. ఇందుకా వీళ్లను ఎన్నుకుందని పలువురు ప్రజాస్వామ్య వాదులు కూడా.. చెబుతుంటారు. ఒకరి నొకరు దూషించుకోవడం.. విమర్శించుకోవడం.. అరుపులు, కేకలు, సభను జరగకుండా అడ్డు కోవడం వంటివి మనకు మామూలైపోయాయి. వీటిని చూస్తే.. చాలా మందికి ఆగ్రహం కూడా కట్టలు తెగుతుంటుంది. అయితే.. పొరుగున ఉన్న తైవాన్ దేశంలో పార్లమెంటు రణరంగంగా మారింది.
అక్కడ ఎంపీలు అరుచుకోవడం కాదు.. కరుచుకోవడం వరకు వెళ్లిపోయారు. ఒకరిపై ఒకరు కలబడ్డారు కూడా. తోసుకున్నారు. ఆ తర్వాత కొట్టుకున్నారు. అంతేకాదు.. ఒకరి బల్లలపై మరొకరు ఎక్కేశారు. మహిళా సభ్యులని కూడా చూడకుండా దాడులకు తెగబడ్డారు. ఫక్తు.. రోడ్ సైడ్ రోమియోల మాదిరిగా చట్ట సభల సభ్యులు వ్యవహరించడంతో ఇది కాస్తా.. దేశ సరిహద్దులు దాటేసి.. ప్రపంచ దేశాలకు కూడా పాకిపోయింది. దీంతో తైవాన్ చట్ట సభల తీరును చూసి అందరూ అవాక్కవుతున్నారు.
ఏం జరిగింది.?
తైవాన్ ప్రభుత్వం విద్య, మద్యం కొనుగోలు, వినియోగం సహా పలు అంశాల్లో కొన్ని సంస్కరణలు తీసుకు వచ్చింది. వీటితోపాటు ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించే చట్ట సభ సభ్యులకు మరిన్ని అధికారారులు ఇచ్చే బిల్లును తెచ్చారు. దీనికి సంబంధించిన బిల్లులను శుక్రవారం చట్టసభల్లో ప్రవేశ పెట్టారు. అయితే.. వీటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించారు. తొలుత మాటలకే పరిమితమైన అధికారులు తర్వాత చేతలకు దిగారు.
సంబంధిత బిల్లు ప్రతులు సహా కీలక ఫైళ్లను ప్రతిపక్ష ఎంపీలు పట్టుకుని పార్లమెంటు వెలుపలకి పరుగు పెట్టారు. దీంతో ఒక్కసారిగా సభలోఅలజడిరేగింది. విపక్ష సభ్యులపై అధికార పక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. మంచి చేస్తున్నా సహించ లేక పోతున్నారంటూ.. విమర్శలు, ప్రతివిమర్శలతో సభ దద్దరిల్లింది. ఈ క్రమంలోనే ఎంపీలు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. అంతేకాదు.. స్పీకర్ చుట్టూ చేరి.. అరుపులు కేకలు పెట్టారు. కొందరు టేబుళ్ల పైకెక్కి దూకడం, మరికొందరు సహచరులను నేలపై ఈడ్చుకెళ్తుండడం వంటివి సభలో భయానక వాతవారణం సృష్టించాయి. ప్రస్తుతం ఇవన్నీ.. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుండడం గమనార్హం.