బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు.. పొత్తుల తప్పు.. తమ్మినేని పదవికి ముప్పు?

వామపక్షాలు అంటే సిద్ధాంతబద్ధమైన పార్టీలు. అన్ని పార్టీలకూ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, వామపక్షాల సంగతి వేరు

Update: 2023-12-05 10:30 GMT

వామపక్షాలు అంటే సిద్ధాంతబద్ధమైన పార్టీలు. అన్ని పార్టీలకూ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, వామపక్షాల సంగతి వేరు. జాతీయ స్థాయిలోనూ పదవులకు ఆశపడని చరిత్ర వారి సొంతం. అలాంటి పార్టీలు క్రమంగా ప్రజలకు దూరమవుతున్నాయనే భావన వ్యక్తమవుతోంది. చట్ట సభల్లో అవి కోల్పోతున్న ప్రాధాన్యమే దీనికి నిదర్శనంగా చూపుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో రెండుసార్లుగా ప్రాతినిధ్యమే లేదు. తెలంగాణలో గత ఎన్నికల్లోనూ వారికిదే పరిస్థితి ఎదురైంది. తాజా ఎన్నికల్లో సీపీఐ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొంది అసెంబ్లీలో రెండోసారి అడుగు పెడుతున్నారు.

సీపీఐ సరే.. సీపీఎం సంగతేంటి..?

కాంగ్రెస్ తో ఎలాగోలా బేరమాడి కొత్తగూడెం సీటును దక్కించుకుని గెలిచింది సీపీఐ. అదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద బలంగా మిగిలింది. వాస్తవానికి ఇక్కడ సీపీఐకి సీటు పరిస్థితుల కారణంగానే వచ్చింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ కు ఎడవల్లి క్రిష్ణ రూపంలో నాయకుడు ఉన్నప్పటికీ.. కూనంనేని అనుభవం ఆయనకు కలిసొచ్చింది. మరే పెద్ద నాయకుడూ ఇక్కడ పోటీ పడకపోవడం సీపీఐకి ఈ స్థానాన్ని కేటాయించేలా చేసిది. ఈ క్రమంలో మునుగోడు డిమాండ్ ను వదులుకుంది సీపీఐ. కానీ, సీపీఎంకు మాత్రం అలాకాదు. ఆ పార్టీ పాలేరు, మిర్యాలగూడ తదితర స్థానాలను కోరుకుంది. కాంగ్రెస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాలు పరిశీలనలో ఉన్న సీటు అది. కానీ, పాలేరునే పట్టుబట్టిం సీపీఎం. చివరకు కాంగ్రెస్ ఆ స్థానం ఇవ్వలేదు.

పొత్తు సర్దుకుపోవాల్సింది..

సీపీఐ తరహాలోనే కాస్త పట్టువిడిచి పాలేరును వదులుకుని కాంగ్రెస్ తో సీపీఎం సర్దుకుపోవాల్సింది. కానీ, పాలేరు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత నియోజకవర్గం. అక్కడ నేరుగా ఆయనే పోటీ చేయాలనుకున్నారు. దీంతో పాలేరు కోసం గట్టిగా పట్టుబట్టారు. వాస్తవానికి వామపక్షాల రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరు. దీన్ని పక్కనపెట్టి ఓవైపు కూనంనేని, మరోవైపు తమ్మినేని పోటీకి సిద్ధపడ్డారు. ఇక పాలేరుపై పంతానికి పోయిన తమ్మినేని.. కాంగ్రెస్ తో పొత్తు కుదరకుండా చేశారనే విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఇందులో వాస్తవం తక్కువే. ఎందుకంటే.. పాలేరులో కాంగ్రెస్ టికెట్ కు తుమ్మల, పొంగులేటి వంటివారు పోటీ పడ్డారు. దీంతోనే ఆ పార్టీ ఈ స్థానాన్ని ఇవ్వలేదు. అయితే, రాష్ట్రంలో మరెక్కడైనా కనీసం ఒక సీటైనా ఇచ్చేలా కాంగ్రెస్ తో సయోధ్య కుదుర్చుకుంటే తమ్మినేనికి ఇబ్బంది లేకుండా ఉండేది.

ప్రజాదరణ లేక కాదు.. పొందలేక

తమ్మినేని పాలేరులో పోటీ చేయకుండా ఉన్నా బాగుందేమో..? ఎన్నో ప్రజా ఉద్యమాలు, పాదయాత్రలు చేసిన ఆయన కేవలం 5,308 ఓట్లు పొందడానిన చూస్తే ఇదే అనిపిస్తుంది. సామాన్య యువతి బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష కంటే తమ్మినేనికి 446 ఓట్లు తక్కువగా వచ్చాయి. తమ్మినేనికి 5,308 ఓట్లు రాగా.. డిపాజిట్‌ దక్కలేదు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్కకు 5,754 ఓట్లు వచ్చాయి. ఇక దాదాపు రెండేళ్ల కిందట తమ్మినేని స్వగ్రామం తెల్దారుపల్లిలో ఆయన సమీప బంధువు, బీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కిష్టయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయంలో సీపీఎం నాయకత్వంపైనే ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదనే విమర్శలు వచ్చాయి. తెల్దారుపల్లిలో మొత్తం 3,325 ఓట్లుండగా 3,150 పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2,030ఓట్లు, తమ్మినేని వీరభద్రానికి 665 ఓట్లు పడ్డాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డికి 246 ఓట్లు వచ్చాయి. సీపీఎం తప్ప మరే పార్టీ పేరు వినిపించని గ్రామంగా తెల్దారుపల్లిని చెబుతారు. అలాంటిచోటనే తమ్మినేనికి వెయ్యి ఓట్లు కూడా రాలేదు.

రాష్ట్ర కార్యదర్శిగా ఉంటారా?

తెలంగాణ ఏర్పాటు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రమే కొనసాగుతున్నారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా తాజా పరాజయం ఆయనకు ఇబ్బందికరమే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కార్యదర్శి పదవి నుంచి తమ్మినేని తప్పుకొంటారా? లేక పార్టీనే తప్పుకోమని కోరుతుందా? అనేది చూడాలి.

Tags:    

Similar News