హోంమంత్రి ఇంటికి వెళితే టీడీపీ కండువాతో షాకిచ్చిన పెద్దమనిషి!

ఇదిలా ఉంటే.. తాజాగా హోంమంత్రి వనిత ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆయన.. మెడలో టీడీపీ కండువాను వేసుకొని బయటకు వచ్చారు.

Update: 2023-10-16 04:28 GMT

అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు స్పందించే తీరుతో.. సదరు నేత స్థాయి ఎంతన్నది ఇట్టే చెప్పొచ్చు. తమకు ఇరిటేట్ కలిగించే సంఘటనలు జరిగినప్పుడు బ్యాలెన్సు మిస్ కాకుండా.. సంయమనంతో వ్యవహరించటం ద్వారా అందరి గౌరవాభిమానాల్ని పొందే తీరు ఎలా ఉంటుందో చేతల్లో చేసి చూపించారు ఏపీ హోం మంత్రి వనిత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనతో నడుస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ఇంటింటికి వెళ్లే పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు అనవసరమైన చిక్కుల్లో పడటం.. తమకున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకోవటం తెలిసిందే.

అందుకు భిన్నంగా వ్యవహరించిన మంత్రి వనిత.. కూల్ గా బిహేవ్ చేసి వావ్ అనేలా ఆమె తీరు ఉందని చెప్పాలి. ఇంతకూ జరిగిందేమంటే.. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడుకు చెందిన 80 ఏళ్ల వల్లభని సోమరాజు మొదట్నించి తెలుగుదేశం అభిమాని.

ఆయన పార్టీకి ఎంత పెద్ద అభిమాని అంటే.. పార్టీ కండువాను మెడకు చుట్టుకునే బయటకు వస్తారు. ఇదిలా ఉంటే.. తాజాగా హోంమంత్రి వనిత ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆయన.. మెడలో టీడీపీ కండువాను వేసుకొని బయటకు వచ్చారు.

పోలీసులు.. వైసీపీ నాయకులు ఆయన ధరించిన టీడీపీ కండువాను తీసేయాలని కోరారు. అయినప్పటికి ఆయన మాత్రం ససేమిరా అనటమే కాదు.. తీసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వయసులో పెద్ద మనిషి కావటంతో ఏం చేయలేక కిందా మీదా పడిన పరిస్థితి.

సోమరాజు ఇంటికి వచ్చిన హోం మంత్రి.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్ని వివరిస్తుండగా కలుగజేసుకున్న ఆయన.. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. టీడీపీ పుట్టినప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయని చెప్పిన తీరుకు మంత్రి వనిత కాసింత ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆయన ఆత్మవిశ్వాసానికి స్పందనగా ఆమె నవ్వుకుంటూ పక్కింటికి వెళ్లారు. మంత్రి తండ్రి ఒకప్పుడు టీడీపీలోనే ఉండేవారిన.. క్రమశిక్షణ.. నాయకత్వ లక్షణాలు టీడీపీతోనే సాధ్యమవుతాయన్న సోమరాజు మాటలు ఎలా ఉన్నా.. ఈ ఎపిసోడ్ రసాభాస కాకుండా వ్యవహరించటంలో మంత్రి వనిత తెలివిగా వ్యవహరించారని చెప్పక తప్పదు. ఏ మాత్రం బ్యాలెన్సు మిస్ అయినా.. ఆమె ఇబ్బందులకు గురయ్యే వారు. అనూహ్య పరిణామాల వేళ.. మంత్రి వనిత మాదిరి వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News