రేవంత్ ప్రభుత్వం కూలిపోయేలా కుట్రలు... సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్!
వచ్చే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అంటూ ఇటీవల బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డితోపాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా పేరు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన సుమారు 10ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రజలు అధికారం అప్పగించారు. ఈ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై జోస్యం చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని అంటున్నారు. దీంతో టీ. కాంగ్రెస్ సీరియస్ అయ్యింది.
అవును... వచ్చే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అంటూ ఇటీవల బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డితోపాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాఖ్యలపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడించింది. ప్రధానంగా బీఆరెస్స్ నేతలు ఇంత బలంగా చెబుతుండటం వెనుక కథ ఏమై ఉంటుందనే చర్చ బలంగా నడిచింది.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగా... కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోయేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీఆరెస్స్, బీజేపీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ నేత, టీకాంగ్రెస్ నేతలు చారుకొండ వెంకటేష్, మధుసూదన్ లు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో వీరి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే తీసుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ ఫిర్యాదులో భాగంగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటై కనీసం వంద గంటలు గడవక ముందే బీఆరెస్స్, బీజేపీ ల నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇదే క్రమంలో... గతంలో బీఆరెస్స్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇదే సమయంలో 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలను బీఆరెస్స్ ఆకర్షించిందని ఆరోపించారని తెలుస్తుంది.
కాగా... ఇటీవల బీఆరెస్స్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అవస్థలు తప్పవని, ఆ పార్టీకి భారీ మెజార్టీ లేకపోవడంతో త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని, కేసీఆర్ మరళా సీఎం అవుతారని అన్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని, ఒక ఏడాది తర్వాత బీజేపీ ప్రభుత్వం ఉంటుందని కామెంట్ చేశారు.
ఇదే క్రమంలో తాజాగా మరో బీఆరెస్స్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ... ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ త్వరలో బీఆరెస్స్ ప్రభుత్వమే ఏర్పడుతుందని.. కార్యకర్తలు అధైర్య పడొద్దని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో టీ-కాంగ్రెస్ నేతలు తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేశారు.