బాబూ విన్నారా? 'హాట్' దిస్ పాయింట్!!
కొన్ని కొన్ని విభాగాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు తీసేస్తున్నారు.
కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. అనేక విషయాల్లో టీడీపీ తమ్ముళ్ల జోక్యం పెరుగుతున్నదన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. వీటిపై క్షేత్రస్థాయిలో అనేక మంది నాయకులు ఫైర్ అవుతున్నారు. లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తారా? మీడియా లేదు.. గీడియా లేదంటూ.. ఎమ్మెల్యే కొలిక పూడి వంటి వారు.. తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. కానీ, వాస్తవాలను దాచిపెట్టేస్తే దాగుతాయా? అనేది ప్రశ్న. ఎప్పుడో ఒకప్పుడు వెలుగులోకిరాకుండా పోవు.
ఇప్పుడు అదే జరిగింది. కొన్ని కొన్ని విభాగాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు తీసేస్తున్నారు. వారి స్థానంలో తమ వారిని నియమించుకుంటున్నారు. ఈ విషయా లు.. సోషల్ మీడియాలో తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయినా.. సర్కారు స్పందించలేదు. కానీ, తాజాగా బాధితులు.. మూకుమ్మడిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆశ్రయించి.. తమ గోడు వెళ్లబోసు కున్నారు.
ఉప గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పవన్‌ను కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు.(కూటమి సర్కారు వచ్చాక జరిగిందే) తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇక, కడప జిల్లా కమలాపురం ల్యాబ్ లో గత పదేళ్లుగా హెల్పర్ గా పని చేస్తున్న జి.సుజన కుమారి అనే దివ్యాంగురాలు కూడా తన ఆవేదన వెళ్లబోసుకుంది. తనను మూడు నెలల క్రితం విధులు నుంచి తొలగించారని, పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువులను ఎత్తే పనులు చేయలేనని తెలిపారు. ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలని సుజన కుమారి వేడుకున్నారు.
అయితే.. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారనేదానికి ప్రత్యక్ష సాక్ష్యాలు వారే. క్షేత్రస్థాయిలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు.. దూకుడు ప్రదర్శిస్తూ.. ఉద్యోగులపై వైసీపీ ముద్ర వేసి వారిని తొలగించ డంతోపాటు.. తమ వారిని నియమించుకుంటున్నారు. సో.. ఈ పరిణామాలకు ఇప్పుడే చెక్ పెట్టకపోతే.. మున్ముందు.. తామర మాదిరిగా తమ్ముళ్లు రెచ్చిపోవడం ఖాయం. పవన్‌ను కలిశారు కాబట్టి.. ఇదైనా వెలుగు చూసింది. లేకపోతే.. ఇలాంటి కథలెన్నో!!