కూటమిలో ఉండీ.. కవ్వింపులా.. కేంద్రం తీరుపై టీడీపీ గుస్సా ..!
రాజకీయంగా కవ్వింపులు సహజమే. అయితే.. అవి ప్రత్యర్థుల మధ్య మాత్రమే ఉంటాయి.
రాజకీయంగా కవ్వింపులు సహజమే. అయితే.. అవి ప్రత్యర్థుల మధ్య మాత్రమే ఉంటాయి. కానీ, మిత్రప క్షాల మధ్య కూడా కవ్వింపులు ఉంటే? మిత్రపక్షాలని చెప్పుకొంటూనే తెరచాటున చేయాల్సింది చేస్తే? ఇదే ఇప్పుడు టీడీపీ-బీజేపీల మధ్య కొనసాగుతోంది. దీనిపైనే టీడీపీ నేతలు గుస్సాగా ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రబుత్వం ఏర్పడి 100 రోజులు అయింది. చంద్రబాబు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ, ఆ మేరకు కేంద్రంలోని బీజేపీ కూటమి సర్కారు నుంచి సహకారం మాత్రం దక్కకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా మూడు అంశాలపై టీడీపీ నేతలు అంతర్గత చర్చల్లో బీజేపీ వైఖరిని తీవ్రస్తాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే.. పైకి మాత్రం ఎవరూ పెదవి విప్పడం లేదు. కానీ, అంతర్గతంగా మాత్రం రగిలిపోతున్నారు.
1) వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు 6880 కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు విన్నవించారు. దీనికి సంబంధించి ప్రాథమిక నివేదిక కూడా పంపించారు. అయితే.. కేంద్రం కేవలం 1430 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొంది.
2) అమరావతికి రూ.15 వేల కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తానని కేంద్రమే బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కానీ, నెలలు గడిచిపోతున్నా.. దీనికి సంబంధించి అడుగులు ముందుకు పడడం లేదు. దీనిపై తాజాగా చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తూ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా నివేదిక ఇచ్చారు. మీరు నిధులు ఇస్తేనే పనులు ముందుకు సాగుతాయన్నారు. కానీ, ఆశించిన విధంగా సమాధానం చిక్కలేదు.
3) పోలవరంలో డయాఫ్రం వాల్ పాడైపోయిన విషయం తెలిసిందే. దీనిని బాగు చేసేందుకు 7 వేల పైచిలుకు కోట్ల రూపాయలుకానీ, రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రానికి నివేదిక పంపించింది. దీనిని అన్ని కోణాల్లోనూ పరిశీలించిన కేంద్ర మంత్రులు ముందు ఓకే అన్నారు. తర్వాత.. అది అధికారులకు చేరింది. అక్కడ 3 వేల కోట్లకు కోత పెట్టారు. 4 వేల పైచిలుకు కోట్లు సరిపోతాయని తేల్చేసి.. అధికారులు.. సంబంధిత జలశక్తి మంత్రికి నివేదిక పంపించారు. దీనికి ఆయన గుడ్డిగా సంతకం చేసేశారు.
కానీ, ముందుగా దీనిని కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో రాష్ట్రం 7 వేల కోట్లు వస్తాయని సంబరపడింది. కానీ, చివరకు 3 వేల కోట్లు కోత పెట్టడంతో తల పట్టుకుంది. ఇలా చెప్పుకొంటూ పోతే.. పలు విషయాల్లోకేంద్రం నుంచి సహకారం అందడం లేదని రాష్ట్ర మంత్రులే చెబుతుండడం గమనార్హం.