ఎమ్మెల్యే పుట్టిన రోజు.. బాదేసిన కార్పొరేటర్లు.. బాబుకు ఫిర్యాదు..!
భారీ ఎత్తున బ్యానర్లు కట్టాలని.. వీధికో కటౌట్ ఏర్పాటు చేయాలని.. పెద్ద ఎత్తున కేకులు కట్‌చేసి..పండుగ నిర్వహించాలని అనధికార ఉత్తర్వులు మౌఖికంగానే జారీ చేశారు.
పుట్టిన రోజు వేడుకల కోసం.. నాయకులు హంగామా చేస్తున్న విషయం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. అది ఏ పార్టీ అయినా.. ఒకటే. అయితే.. కొందరు సైలెంట్‌గా చేసుకుంటే, మరికొందరు రోడ్డున పడుతు న్నారు. భారీ ఎత్తున కటౌట్లు పెట్టించడం.. బ్యానర్లు కట్టించడం.. రోడ్డుకో బ్యానర్ ద్వారా హంగా మా చేయడం షరా మామూలే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇలాంటి ఘటనే విజయవాడలోనూ చోటు చేసుకుంది. ఓ టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడి పుట్టిన రోజు వేడుక తాజాగా జరిగింది.
ఈయన అధికారంలో ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ప్రజలకు చేరువ కాలేక పోతున్నా.. వివాదాలకు మాత్రం కేంద్రంగా మారుతున్నారని.. ఇప్పటికే చంద్రబాబు వరకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా.. ఆయన తీరు మార్చుకోవడం లేదన్న చర్చ పార్టీలోనూ సాగుతోంది. పైగా.. పొలిట్ బ్యూరోలనూ ఉండడంతో ఎవరూ నోరు ఎత్తేందుకు కూడా సాహసించడం లేదు. ఇక, తాజాగా జరిగిన పుట్టిన రోజు వేడుకలకు.. కార్పొరేటర్లకు ఆయన లక్ష్యాలు నిర్దేశించారు.
భారీ ఎత్తున బ్యానర్లు కట్టాలని.. వీధికో కటౌట్ ఏర్పాటు చేయాలని.. పెద్ద ఎత్తున కేకులు కట్‌చేసి..పండుగ నిర్వహించాలని అనధికార ఉత్తర్వులు మౌఖికంగానే జారీ చేశారు. అయితే.. వైసీపీ హయాంలో తాము నష్టపోయామని.. పైగా ఎన్నికల సమయంలో చేసిన ఖర్చులే ఇవ్వలేదని మెజారిటీ కార్పొరేటర్లు ఆయన దగ్గర పంచాయతీ పెట్టారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే.. స్థానికంగా ఉన్న వ్యాపారుల నుంచి వసూలు చేసి.. ఖర్చుచేయాలని ఆదేశించినట్టు తెలిసింది.
దీంతో సదరు నియోజకవర్గం పరిధిలోని పెద్ద, చిన్న వ్యాపారుల నుంచి భారీ ఎత్తున కార్పొరేటర్లు వసూళ్ల కు దిగారు. ఇది వ్యాపార వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది. ఇదేం పద్ధతి .. మేం స్వచ్ఛందంగా ఇస్తామని కొందరు.. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై మంత్రి స్పందించేలోగానే.. కార్పొరేటర్లు వసూళ్లకు దిగడంతో బుధ, గురువారాల్లో నియోజకవర్గంలోపలు వ్యాపార సంస్థలను నిర్వాహకులు మూసేశారు. కార్పొరేటర్ల వ్యవహార శైలిపై వారు చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
మరోవైపు.. ప్రభుత్వం పలు కాలనీల ప్రజలకు గతంలో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తోంది. వీటికి అయ్యే ఖర్చులను ప్రజలే భరిస్తున్నారు. కానీ, పట్టా కాయితాలు మాత్రం ఎమ్మెల్యే తన కార్యాలయానికి పంపించాలని.. ప్రజలకు నేరుగా ఇవ్వొద్దని అధికారులకు హుకుం జారీ చేశారని.. అధికారులే నేరుగా ప్రజలకు చెబుతున్నారు. దీంతో ఆయా కాలనీల ప్రజలు ఎమ్మెల్యే తీరుపై రగిలిపోతున్నారు. వసూళ్ల పర్వం కోసమే ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారని.. సదరు కాలనీల వాసులు నిప్పులు చెరుగుతున్నారు.