బాబు క‌ళ్ల‌కు గంత‌లు క‌డుతున్న 'సీఎంవో' ...!

తాజాగా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మంత్రులతో భేటీ అయ్యారు.

Update: 2024-10-21 04:42 GMT

తాజాగా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెప్పాల్సింది చెప్పుకొచ్చారు. ఇసుక, మద్యం విషయాల్లో మీ జోక్యం వద్దని, గత ప్రభుత్వం ఇలాగే నష్టపోయిందని ఎమ్మెల్యేలు ఎంపీలు దూరంగా ఉండాలని చంద్రబాబు తన దైన శైలిలో చెప్పుకొచ్చారు. అయితే, ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది నుంచి వచ్చిన విజ్ఞాపనలు ఆశ్చర్యంగా ఉన్నాయి. తాము.. నాలుగు నెలలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ సీఎం అపాయింట్మెంట్ కానీ మంత్రి నారా లోకేష్ అపాయింట్మెంట్ కానీ దొరకటం లేదని మెజారిటీ ఎమ్మెల్యేలు ఘోల్లున మొరపెట్టుకున్నారు.

దీంతో చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఇలా ఎలా జరుగుతోంది? అని ఆయన ప్రశ్నించారు. గతంలో వైసిపి హయాంలో ఇలానే ఎమ్మెల్యేలు ఎంపీలకు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అన్ని కార్యక్రమాలను సలహాదారులు అలాగే ఇతర నాయకులకు లేదా ఇతర అధికారులకు అప్పగించారు. దీంతో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. జిల్లాల్లో అభివృద్ధి పనులు జరగక, నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్న పనులు జరగక ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడ్డారు.

ఇదే విషయాన్ని రాజానగరం ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత బయటపెట్టారు. ఆ తర్వాత మరికొందరు కూడా ఇదే విషయం చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా టిడిపి కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించటం.. గ‌మ‌నార్హం. తమకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటే నియోజకవర్గంలో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని చంద్రబాబును ప్రశ్నించడం అత్యంత ఆసక్తిగా మారింది. చంద్రబాబు ప్రసంగించిన తర్వాత మీడియాను బయటకు పంపేసి అంతర్గతంగా ఎమ్మెల్యేలు ఎంపీలతో దాదాపు అరగంట సేపు చంద్రబాబు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగానే వారు తమ అపాయింట్మెంట్ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా గుంటూరుకే చెందిన ఒక ఎమ్మెల్యే పదిసార్లు తాను ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చానని అపాయింట్మెంట్ కోరుతూ నాలుగు సార్లు లేఖలు పెట్టానని ఆధారాలతో సహా చూపించారు. దీంతో ఆశ్చర్యపైన చంద్రబాబు ఏం జరుగుతోందో తను తెలుసుకుంటానని చెప్పారు. అయితే ఇది ఎంతవరకు ఆయన పరిష్కరిస్తారు అనే దానినిబట్టి ఎమ్మెల్యేల సంతృప్తి ఆధారపడి ఉంటుంది.

ఇది ఇలా ఉంటే గతంలో కూడా ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన అధిపతి చంద్రబాబును కలుసుకోవడానికి నాలుగు సార్లు ప్రయత్నించగా నాలుగు సార్లు అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ఆమె చంద్రబాబు సోషల్ మీడియాకు నేరుగా పోస్ట్ పెట్టారు. ``నేను మీకోసం ఎదురు చూస్తున్నాను కలుసుకోవాలని. అమరావతిలో మా సంస్థను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా. 50 కోట్ల వరకు మేము పెట్టుబడి పెడతా``మని ఆమె చెప్పి తాను ఎదుర్కొన్నటువంటి సంఘటనలను వివరించారు.

దీంతో ఆశ్చర్యపోయిన‌ చంద్రబాబు అప్పట్లోనే ఆమెకు సారి చెప్పడం, వెంటనే అపాయింట్మెంట్ రెడీ చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరి సీఎం ఓలో ఏం జరుగుతోందనేది చంద్రబాబుకు తెలుసా?; నిజంగానే తెలియదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

Tags:    

Similar News