టీడీపీలో అధికార ప్రతినిధుల 'రచ్చ' ..!
ఈ క్రమంలో ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు గా ఉన్న ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఏం చెప్పాలన్నా వీలు పడని పరిస్థితి నెలకొంది.
కూటమి సర్కారుకు నేతృత్వం వహిస్తున్న టీడీపీలో అధికార ప్రతినిధుల రచ్చ జోరుగా సాగుతోంది. ఎవరినీ ఇప్పటి వరకు అధికార ప్రతినిధులుగా ప్రకటించక పోవడం.. ఈ పదవుల కోసం కూడా నేతలు క్యూ కట్టడం వంటివి పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు పార్టీ అధికారంలో లేకున్నా.. ఠచనుగా అధికార ప్రతినిధులను ఏర్పాటుచేసేవారు. ఇలా అధికార ప్రతినిధులుగా ఉన్నవారు.. ఇప్పుడు కొందరు మంత్రులు అయ్యారు.
దీంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. మరోవైపు.. అధికార ప్రతినిధులను ఏర్పాటు చేసి రెండేళ్లు గడిచి పోయింది. ఇప్పటి వరకు అధికార ప్రతినిధులను నియమించలేదు. దీంతో పార్టీ తరఫున వాయిస్ వినిపించేవారు కూడా కనిపించడం లేదు. కొందరు ఉన్నప్పటికీ.. వారికి ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు 21 జనసేన పార్టీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు మీడియా ముందుకే రావడం లేదు. అసలు పార్టీలైన్‌ను కూడా వారు వదిలేశారు.
ఇదిలావుంటే.. బీజేపీ ప్రాతినిధ్యంవహిస్తున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రచారం ఎక్కువైంది. హిందూత్వ ప్రమోషన్‌తోపాటు.. మోడీ ప్రమోషన్ పెరిగిపోయింది. ఈ క్రమంలో ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు గా ఉన్న ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఏం చెప్పాలన్నా వీలు పడని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అధికార ప్రతినిధుల విషయంపై స్పస్టత ఇవ్వాలని.. నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు.
తెలుగు మహిళ పరిస్థితిఏంటి..?
మరో కీలకమైన పదవి.. పార్టీ పరంగా చూసుకుంటే.. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు. గతంలో వంగలపూడి అనిత నాలుగేళ్లు ఈ పదవిలోనే ఉన్నారు. ఆమె ఇప్పుడు మంత్రి అయ్యాక.. ఈ పదవిని ఎవరికీ కేటాయించలేదు. దీంతో ఈ పోస్టు ఖాళీగానే ఉంది. దీనిని తమకు కేటాయించాలని.. కొందరు ఇప్పటికే క్యూ కట్టారు. అయినా.. చంద్రబాబు ఈ విషయంలో తాత్సారం చేస్తున్నారు. దీంతో ప్రతి విషయానికీ వంగలపూడి అనితే స్పందించాల్సి వస్తుండడంగమనార్హం. ఈ క్రమంలో ఆయా పదవులను సత్వరమే భర్తీచేయాలని మహిళా నాయకులు సైతం కోరుతున్నారు.