పోతుల సునీతకు టీడీపీ రెడ్ సిగ్నల్ ?

ఆ పార్టీ ద్వారా 2014లో టికెట్ సంపాదించి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

Update: 2024-09-07 03:38 GMT

ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీతో రాజకీయం మొదలెట్టారు. ఆ పార్టీ ద్వారా 2014లో టికెట్ సంపాదించి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అయితే చంద్రబాబు ఆమెకు 2017లో ఎమ్మెల్సీని చేశారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమె వైసీపీలో చేరిపోయారు.

ఆ పార్టీ తరఫున ఏపీ మహిళా అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. ఆ టైం లో టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేసేవారు పోతుల సునీత. ఇక 2023లో జగన్ ఆమెకు మరోసారి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అయితే తాజా ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో ఆమె వైసీపీకి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్సీ పదవిని సైతం వదులుకుని టీడీపీ వైపు రావాలని అనుకుంటున్నారు

శాసనమండలిలో వైసీపీకి తొలి షాక్ ఇచ్చింది పోతుల సునీతనే. ఇదిలా ఉంటే ఆమె ఖాళీ చేసిన ఎమ్మెల్సీ సీటు అయితే ఆమెకు దక్కేది లేదు. ఎందుకంటే ఆమెకు టీడీపీలోనే ఎంట్రీ దొరకడం లేదు అని అంటున్నారు. ఆమెను పార్టీలోకి తీసుకోవద్దు అని శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్న టీడీపీ నేతలు అంతా బాబుకు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఆమె వైసీపీలో ఉన్నపుడు టీడీపీ మీద బాబు మీద చేసిన విమర్శలను గుర్తు చేస్తున్నారు. అంతే కాదు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్సీని చేశారు. అయినా పార్టీ ఓడాక కష్టకాలంలో ఉండకుండా వైసీపీలో చేరి ఇబ్బందులు పెట్టిన ఆమె తిరిగి వస్తే ఎలా చేర్చుకుంటారు అని అడుగుతున్నారు. దాంతో పాటు చీరాలలో టీడీపీ నేతలు కూడా ఆమెను తీసుకోవద్దు అని ఆందోళలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినాయకత్వం ఆమెకు రెడ్ సిగ్నల్ చూపిస్తోంది అని అంటున్నారు.

దీంతో పోతుల సునీత రాజకీయం ఏమవుతుందో అన్న చర్చ సాగుతోంది. ఆమె 2023లో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ పదవీ కాలం 2029 దాకా ఉంది. వైసీపీలో ఉంటే ఆమె మిగిలిన అయిదేళ్ళ కాలమూ ఆ పదవిలోనే హాయిగా కొనసాగేవారు. మరి పార్టీ ఓడిన ప్రతీ సారీ మారడం అన్నది ఆమె అలవాటు చేసుకున్నారని దాని వల్లనే ఆమెకు ఇపుడు ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఈ రకమైన రాజకీయాలు చేసేవారిని పార్టీ అధినాయకత్వాలు కూడా చేర్చుకోకుండా దూరంగా పెట్టడమే బెటర్ అని అంటున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కానీ ఓడిన పార్టీలో ఉండమని చెబుతూ గెలిచిన పార్టీలలోకి వెళ్ళి కండువాలు కప్పుకోవడం, అంతకు ముందు ఉన్న పార్టీని విమర్శించడం ద్వారా టెంపరరీగా రాజకీయ ప్రయోజనాలు దక్కవచ్చేమో కానీ లాంగ్ టెర్మ్ లో మాత్రం పొలిటికల్ కెరీర్ కే ఎండ్ కార్డు పడిపోయే ప్రమాదం ఉందన్నది పోతుల సునీత వ్యవహారం తెలియచేస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News