నాడు త‌ప్పులు చేశారు.. నేడు చేరిపోతున్నారు.. టీడీపీ పున‌రావాస శిబిర‌మా?

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. స‌ద‌రు నాయ‌కుల ప్రొఫైల్ కానీ.. గ‌త చ‌రిత్ర‌ను కానీ.. ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండానే చాలా మంది జెండాలు క‌ప్పేస్తున్నారు.;

Update: 2025-03-26 14:30 GMT
నాడు త‌ప్పులు చేశారు.. నేడు చేరిపోతున్నారు.. టీడీపీ పున‌రావాస శిబిర‌మా?

'' తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు నిబ‌ద్ధ‌త ఉంది. మేం వైసీపీ మాదిరిగా అరాచ‌క శ‌క్తుల‌ను ప్రోత్స‌హించ‌డం లేదు. అలాంటి వారు ఎవ‌రైనా ఉంటే ప‌ద్ధ‌తి మార్చుకోవాలి''- నాలుగు మాసాల కింద‌ట టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఇంకా ఎవ‌రూ మ‌రిచిపోలేదు. కానీ.. ఏమైందో ఏమో.. ఆయ‌న మాట‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో వైసీపీలో ఉండ‌గా అరాచ‌కాలు చేసిన వారు.. క్రికెట్ బెట్టింగుల‌కు పాల్ప‌డిన వారు.. ఇప్పుడు క్యూ క‌ట్టుకుని టీడీపీ చెంత‌కు చేరుతున్నారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. స‌ద‌రు నాయ‌కుల ప్రొఫైల్ కానీ.. గ‌త చ‌రిత్ర‌ను కానీ.. ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండానే చాలా మంది జెండాలు క‌ప్పేస్తున్నారు. వారిని పార్టీలోకి తీసేసుకుంటున్నారు. తాజాగా క్రికెట్‌ బెట్టింగ్‌ డాన్‌గా గుర్తింపు పొందిన కీలక బుకీని టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర‌ద‌రాజులు రెడ్డి కండువా క‌ప్పి మ‌రీ పార్టీ తీర్థం ఇచ్చారు. ప్రొద్దుటూరుకు చెంది.. ఇత‌ను ఒక బెట్టింగ్‌ సామ్రాజ్యాన్నే నడిపిస్తున్నాడు. ప్రారంభంలో జిన్నారోడ్డుకు చెందిన ఒక బుకీ వద్ద గుమాస్తాగా పని చేసేవాడు. తర్వాత అతని వద్దే సబ్‌ బుకీగా పని చేస్తూ నేడు రాయలసీమలోనే పేరు పొందిన క్రికెట్‌ బుకీగా మారాడు.

ఈ బెట్టింగ్‌ డాన్‌పై కేసులు కూడా ఉండడం గ‌మ‌నార్హం. ఇటీవల ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీసులు ముగ్గురు క్రికెట్‌ బుకీలను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో సదరు బెట్టింగ్‌ డాన్‌ ప్రమేయం కూడా ఉందని నిర్ధారించారు. అయితే.. కేసుల నుంచి ర‌క్ష‌ణ పొందేందుకే.. ఇలా డాన్‌లు టీడీపీ వైపు క్యూ క‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో 25వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ మెహరూన్, ఆమె భర్త ఖాద్రి, బావ నూరి టీడీపీలో చేరారు. ఈ ప‌రిణామాల‌పై పార్టీలోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టీడీపీ అరాచ‌క‌శ‌క్తుల‌కు పున‌రావాస కేంద్రంగా మారింద‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ వ్య‌వ‌హారాల‌పై సీఎం చంద్ర‌బాబు దృష్టి పెట్టాల‌ని క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌ను సంస్క‌రించాల‌నికూడా సూచిస్తున్నారు.

Tags:    

Similar News