మోడీ ప్లస్ బాబు ప్లస్ పవన్...మల్టీ స్టారర్ మూవీ రీ రిలీజ్...!

టీడీపీ కూటమి అంటే కొత్త సీసాలో పాత సారా అన్న ముతక సామెతను గుర్తుకు తెస్తోంది అంటున్నారు.

Update: 2024-02-20 03:40 GMT

టీడీపీ కూటమి అంటే కొత్త సీసాలో పాత సారా అన్న ముతక సామెతను గుర్తుకు తెస్తోంది అంటున్నారు. ఎందుకంటే ఇది ఒకసారి చూసేసిన సినిమా అన్నది ఒక మాటగా ఉంది. 2014లో అయితే ఈ కూటమికి వచ్చిన క్రేజ్ అంతా అంతా ఇంతా కాదు, ఎందుకంటే అప్పటికి నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాలకు కొత్తవారు. పైగా గుజరాత్ మోడల్ అంటే దేశమంతా ఆసక్తి చూపిన సందర్భం అది.

అలాగే పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు మీద సానుభూతితో పాటు అనుభవశాలి అన్న ముద్ర వల్ల కూడా జనంలో మొగ్గు కనిపించింది. హైదరాబాద్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు కాంగ్రెస్ అడ్డగోలు విభజనతో కుదేలు అయిన ఏపీకి దశ దిశ చూపిస్తారు అని కూడా జనాలు ప్రగాఢంగా విశ్వసించారు.

ఇక పవన్ కళ్యాణ్ కొత్తగా పార్టీ పెట్టి మోడీకి బాబుకు మద్దతు ఇచ్చారు. ఆయన కొత్త రాజకీయాన్ని చూపిస్తారు అని జనాలు నమ్మారు. ఇలా ముగ్గురు నాయకులూ ఒకే వేదిక మీద కనిపించేసరికి జనాలు ఊగిపోయారు. ఆ ఊపులో జగన్ జైలుకెళ్ళిన సానుభూతి కూడా పనిచేయలేదు. అందుకే జగన్ కి 67 సీట్లు కూటమికి 107 సీట్లు కట్టబెట్టారు.

అయిదేళ్ళ కూటమి పాలన జనాలు చూశారు. బాగులేదని భావించే జగన్ నాయకత్వంలోని వైసీపీకి పట్టం కట్టారు. అది కూడా అలా ఇలా కాదు 151 సీట్లు ఇచ్చారు. ఇక టీడీపీకి 23 సీట్లతో సరిపెట్టారు. అంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అని భావించాలి. ఇక గిర్రున అయిదేళ్లు తిరిగాయి. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి.

అప్పట్లో అంటే 2019లో విడిపోయిన కూటమి అంతా ఒక్కటి అవుతోంది. ఆనాడు చంద్రబాబుని విమర్శించిన పవన్ జనసేన అదే పార్టీతో జట్టు కట్టింది. ఇక బీజేపీ కూడా దగ్గర అవుతోంది. బీజేపీ మీద మోడీ అమిత్ షాల మీద చంద్రబాబు చేసిన విమర్శలు జనం చెవులలో గింగిర్లు కొడుతున్న వేళ కొత్త పొత్తు అని పాత సినిమానే చూపిస్తున్నారు.

ఈ పొత్తుకు క్రేజ్ ఎలా వస్తుంది అన్నదే చర్చ. ఆనాడు ప్రత్యేక హోదా ఇవ్వలేదనే బీజేపీతో విభేదించామని చెప్పిన టీడీపీ ఇపుడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటుంది అన్న ప్రశ్నకు బదులు ఉండదు, పోలవరాన్ని ఏటీఎం లా చంద్రబాబు వాడుకున్నారు అని విమర్శించిన బీజేపీ పెద్దలు ఇపుడు ఏపీలో చంద్రబాబు పాలన గ్రేట్ అని కితాబులు ఇస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో. కొత్త రాజకీయం అంటూ వచ్చిన పవన్ బీజేపీ హోదా ఇవ్వకుండా పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించిన సేనాని ఇపుడు అదే పార్టీతోనూ అవినీతి చేసిందని విమర్శించిన టీడీపీతోనూ పొత్తు పెట్టుకుని ముందుకు వస్తే ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఈ మూడు పార్టీల కలయికలో రాజకీయం ఉంది తప్ప సిద్ధాంతం లేదు అనుకుంటే కూటమికి 2014 ఫలితాలు రిపీట్ కానేకావు అని అంటున్నారు. అలా కాకుండా ఈ కూటమి ఏపీని గట్టిక్కిస్తుంది అని భావించి వైసీపీ పాలనతో పోల్చి చూస్తే 2014 నుంచి 2019 దాకా సాగిన టీడీపీ పాలన మేలు అని భావించినా పట్టం కడతారు.

అయితే ప్రజల ఆశలు తీర్చేలా కూటమి నుంచి హామీలు ఉంటాయా అంటే నిరాశే జవాబుగా వస్తుంది. ఎలా ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎటూ చెప్పదు, పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి ఖర్చులు పెట్టుకుని పూర్తి చేయిస్తామని చెప్పదు. విశాఖ రైల్వే జోన్ విషయం కానీ మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయంలో కానీ హామీలు మాత్రమే ఉంటాయి.

ఢిల్లీని మించిన రాజధాని అన్న మాటకు 2024 ఎన్నికల్లో కొనసాగింపు అయినా ఉంటుందా అంటే ఆశించలేరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయమని చెప్పలేరు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని విభజన హమీలు పూర్తిగా తీరుస్తామని చెబుతారేమో కానీ జనాలకు 2014 నాటి నమ్మకం కలుగుతుందా అంటే సందేహమే.

ఇక చంద్రబాబు అనుభవం గత అయిదేళ్ళలో అక్కరకు రాలేదు. ఈసారి గెలిపించినా అతి తక్కువ అయిదేళ్లలో అమరావతి రాజధాని బ్రహ్మాండంగా నిర్మాణం కాదు అని తెలుసు. సంపద సృష్టి అన్నది కూడా ఒక అయిదేళ్ళలో జరుగుతుందంటే నమ్మే జనాలు తక్కువే. ఏపీలో ఉద్యోగావకాశాలు పారిశ్రామికీకరణ అంటే భౌగోళిక కారణాల వల్ల అది సాధ్యపడే అవకాశాలు తక్కువ అన్నది ఎరిగిన వారు నమ్మే సీన్ ఉండదు.

అయితే కూటమి అధికారంలోకి వచ్చేందుకు ఏమైనా కారణాలు ఉంటాయా అంటే అదే యాంటీ ఇంకెంబెన్సీ. జగన్ అయిదేళ్ల ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంటే కచ్చితంగా ఆ ఓటు మొత్తం కూటమికి దక్కుతుంది. అదే కూటమికి బ్రహ్మాస్త్రం, అందుకే కూటమి నేతలు తమ ప్రసంగాలలో తాము చేసే పనుల గురించి తక్కువ చెబుతూ జగన్ ని ఆయన ప్రభుత్వాన్ని ఎక్కువ తిడుతున్నారు. మరి ఏపీలో నాలుగు కోట్ల ఓటర్లు వైసీపీ ప్రభుత్వం మీద మండిపోతున్నారా. మండిపోతే మాత్రం ఆ మంటలలో చలి కాచుకునేది కచ్చితంగా టీడీపీ కూటమి మాత్రమే. ఎనీ డౌట్స్.

Tags:    

Similar News