ఉమ్మడి వ్యూహం... సరికొత్త యోచనలో టీడీపీ - జనసేన!
ఇదే సమయంలో తాజాగా ముగిసిన యువగలం పాదయాత్ర అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు - పవన్ కల్యాణ్ లు ఒకే వేదికపై కనిపించారు.
ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సూచన ప్రాయంగా ఇప్పటికే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో... అధికార వైసీపీ ఇప్పటికే ఆ పనుల్లో మునిగి పోయిందని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ సరికొత్త వ్యూహాలు పన్నుతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా చాలా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మార్చబోతున్నారని తెలుస్తుంది.
ఇదే సమయంలో తాజాగా ముగిసిన యువగలం పాదయాత్ర అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు - పవన్ కల్యాణ్ లు ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా త్వరలో ఉమ్మడి కార్యచరణ అమలు చెయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా సీట్ల సర్ధుబాటు, అనంతరం ఉమ్మడి మేనిఫెస్టో మొదలైఅన్ కీలక విషయాల్లో ఇద్దరి మధ్యా సానుకూలత ఏర్పడాల్సిన అవసరం ఉంది!
మరోపక్క జనసేనకున్న ఓటు బ్యాంక్ ను 175 నియోజకవర్గాల్లోనూ వాడుకుంటూ.. ఆ పార్టీకి మాత్రం 25 సీట్ల వరకూ ఇవ్వాలని టీడీపీ భావిస్తుందంటూ కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో... ఇది ఏమాత్రం సరైన ఆలోచన కాదని.. కనీసం 60 సీట్లలో జనసేన పోటీ చేయనిపక్షంలో పొత్తు వృథా అని.. ఇలాంటి బానిసత్వపు ఆలోచనలు ఇంకెంతకాలం అని జనసేన శ్రేయోభిలాషులు గొంతు చించుకుంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... ఈ సమయంలో పొత్తు గురించిన ఐకమత్యం, అవగాహన కేవలం అధినేతల్లోనూ, నేతల్లోనూ వస్తే సరిపోదు.. అందుకు గల కారణాలను ప్రజలకు వివరించాలని.. అలాకానిపక్షంలో మొదటికే మోసం వస్తుందని.. ఉన్న ఓటు బ్యాంకు కూడా పోయే ప్రమాధం ఉందనే ఆందోళన టీడీపీ నేతల మనసుల్లో మొదలైందని అంటున్నారు పరిశీలకులు. దీంతో... టీడీపీ - జనసేనలు సరికొత్త యోచన చేయబోతున్నాయని అంటున్నారు.
ఇందులో భాగంగా... రాష్ట్ర వ్యాప్తంగా మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని టీడీపీ - జనసేన భావిస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా మూడు ప్రాంతాల్లోనూ మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నారని అంటున్నారు. ముందుగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర.. అనంతరం రాయలసీమలో సభలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు ఇరు పార్టీల వర్గాలూ ఒక ఆలోచనకు వచ్చాయని అంటున్నారు.
అయితే... ఈ ఉమ్మడి భారీ బహిరంగ సభలు మేనిఫెస్టోకు ముందు నిర్వహిస్తారా.. లేక, ముందుగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఈ సభలు నిర్వహిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.