పోటీకి తెలంగాణా తమ్ముళ్ళ తీర్మానం!

అన్నీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని స్వయంగా చంద్రబాబు చెప్పినందుకే తాము నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేస్తున్నట్లు తమ్ముళ్ళు గుర్తుచేశారు.

Update: 2023-10-30 04:42 GMT

తెలంగాణా ఎన్నికలకు దూరంగా ఉండాలన్న చంద్రబాబునాయుడు నిర్ణయంతో తమ్ముళ్ళ విభేదించారు. రాబోయే ఎన్నికల్లో బలమున్న నియోజకవర్గాల్లో పోటీచేయాల్సిందే అని తీర్మానించారు. అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణా టీడీపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని కాసాని అందరికీ వివరించారు. చంద్రబాబు నిర్ణయంతో తమ్ముళ్ళు విభేదించారు. ఏపీలో పరిణామాలకు తెలంగాణాలో ముడిపెట్టడం ఏమిటని కాసానిని నిలదీశారు.

అన్నీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని స్వయంగా చంద్రబాబు చెప్పినందుకే తాము నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేస్తున్నట్లు తమ్ముళ్ళు గుర్తుచేశారు. తీరా ఎన్నికల ముందు పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవటం ఏమిటని నిలదీశారు.

పోటీచేసే విషయమై చంద్రబాబుతో మరోసారి మాట్లాడాలని తమ్ముళ్ళంతా కాసానికి స్పష్టంగా చెప్పారు. జరుగుతున్న పరిణామాల్లో ఎవరికి నచ్చచెప్పలేక సమావేశంలోనే అధ్యక్షుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు.

పార్టీ తరపున పోటీచేయటం సాధ్యంకాకపోతే ఇండిపెండెంట్ అభ్యర్ధులుగా అయినా సరే బరిలో ఉండాల్సిందే అని తమ్ముళ్ళు తీర్మానంచేశారు. ఇదే తీర్మానాన్ని మరోసారి చంద్రబాబు ముందుంచి చర్చించాలని, పోటీకి ఒప్పించాలని నేతలు కాసానిని గట్టిగా కోరారు.

దాంతో ఏమిచేయాలో అర్ధంకాక అధ్యక్షుడు మౌనంగా ఉండిపోయారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా నేతలు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లోనే ఆందోళనలు కూడా చేశారు. నిజానికి చంద్రబాబు నిర్ణయం తమ్ముళ్ళకే కాదు చివరకు పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు కూడా నచ్చలేదు. కానీ కాసాని చేయగలిగింది కూడా లేదు. అందుకనే చంద్రబాబు నిర్ణయాన్ని తమ్ముళ్ళకి చేరవేసింది.

పోటీ చేయాల్సిందే అన్న తమ్ముళ్ళ తీర్మానాన్ని చంద్రబాబుకు వినిపించే బాధ్యత ఇపుడు కాసానిపై పడింది. అందుకనే వెంటనే రాజమండ్రికి వెళ్ళి పార్టీ జాతీయ అధ్యక్షుడితో మాట్లాడేందుకు ములాఖత్ కు కాసాని ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవబోతోంది. ఆ లోగానే పోటీపై ఏదో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోమని తమ్ముళ్ళు కాసానిపై బాగా ఒత్తిడి తెస్తున్నారు. మరి తమ్ముళ్ళ రియాక్షన్ పై చంద్రబాబు ఏ విధంగా రియాక్టవుతారో చూడాల్సిందే.

Tags:    

Similar News