వైసీపీకి కంచుకోటలో సైకిల్ ని సెట్ చేసే పనిలో బాబు
పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు 2024లో పార్టీ అభ్యర్ధి అనుకుంటే ఆయన్ని తప్పింది సడెన్ గా కొత్త క్యాండిడేట్ ని ఇంచార్జిని చేశారు
చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ఏపీలో తిరుగుతున్నారు. ఈ నెల 8,9 తేదీలలో ఆయన ఉమ్మడి విజయనగరం జిల్లా టూర్ చేయనున్నారు. ఈసారి ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రాజెక్టుల సందర్శన తో పాటు పార్టీ స్థితిగతులను కూడా బాబు జాగ్రత్తగా స్టడీ చేస్తారు అని అంటున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే 2014, 2019లలో ఒక్క సీటు కూడా టీడీపీకి రాలేదు, పైగా రెండు సార్లు అరకు ఎంపీ సీటు కూడా పోయింది. ఈసారి ఎంతో కొంత చక్కదిద్దాలని బాబు ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీలో వర్గపోరు సైకిల్ కి పూర్తిగా బ్రేకులు వేస్తోది.
పార్వతీపురం మన్యం జిల్లాలో చూస్తే పార్వతీపురం కురుపాంలలో వర్గ పోరు మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతోంది. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు 2024లో పార్టీ అభ్యర్ధి అనుకుంటే ఆయన్ని తప్పింది సడెన్ గా కొత్త క్యాండిడేట్ ని చంద్రబాబు ఇటీవలే ఇంచార్జిని చేశారు. ఆయనే బోనెల విజయచందర్. యువకుడు అయిన విజయచందర్ పార్టీని విజయచందర్ బాగా ముందుకు తీసుకెళ్లగలడని టీడీపీ పెద్దలు నమ్ముతున్నారు.
దాంతో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవి అలిగి పక్కకు చేరారు. ఆయనకంటూ ఒక వర్గం బలంగా ఉంది. దాంతో పార్వతీపురంలో సైకిల్ కి పెద్ద రిపేరే ఉంది అని అంటున్నారు. అలాగే కురుపాం సీటు కూడా ఇబ్బందే అని తెలుస్తోంది. ఇక్కడ 2014, 2019లలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల శ్రీవాణి గెలిచింది. మూడవసారి కూడా ఆమెకే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దానికి కారణం టీడీపీలో ఉన్న ఆమె పెద్ద మామగారైన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వ్యవహార శైలి అని అంటున్నారు. ఆయన వర్గానికి చెందిన జగదీశ్వరికి కురుపాం పార్టీ ఇంచార్జి ఇచ్చారు. అయితే ఇక్కడ జిల్లా గ్రంధాలయం మాజీ ప్రెసిడెంట్ దత్తి లక్షణరావు వర్గానికి మాజీ మంత్రి వర్గానికి పడడంలేదు. అందరినీ ఒక్కటిగా చేసుకుని పనిచేయించడంలో మాజీ మంత్రి విఫలం అవుతున్నారు. దాంతో కురుపాం సైకిల్ కి బ్రేకుల మీద బ్రేకులు పడిపోతునాయి.
కురుపాం ఇంచార్జిని కూడా చంద్రబాబు మారుస్తారు అని టాక్ నడుస్తోంది. కురుపాం రాజ వంశానికి చెందిన వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ని బాబు పార్టీలోకి తాజాగా తీసుకున్నారు. ఆయన ఎవరో కాదు కేంద్ర మాజీ మంత్రి 2019లో అరకు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ బంధువు అని అంటున్నారు.
దాంతో ఆయనను కురుపాం ని టీడీపీ అభ్యర్ధిగా నియమిస్తారు అని అంటున్నారు. ఇక అరకు ఎంపీ సీటుకు కేంద్ర మాజీ మంత్రి ఓకే అంటే ఆయనకే అని చెప్పి రంగంలోకి దిగమని బాబు కోరే అవకాశాలు ఉన్నాయట. మొత్తానికి పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీకి కంచుకోట. అక్కడ సైకిల్ ని స్పీడ్ గా పరుగులెత్తించాలని బాబు పంతం పట్టి ఉన్నారు. ఈ ట్రిప్ లో ఆయన ఎంత మేరకు సెట్ చేస్తారో చూడాలని అంటున్నారు.