వీళ్లకి టీడీపీ గేట్లు మూసేసిందా...!
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. వైసీపీలో టికెట్ రాని వారు ఇక్కడకు వస్తామంటే మాత్రం ఎలా రానిస్తాం! అన్నారు.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. వైసీపీలో టికెట్ రాని వారు ఇక్కడకు వస్తామంటే మాత్రం ఎలా రానిస్తాం! అన్నారు. అయితే..ఈ వ్యాఖ్య వెనుక ఆయన ఉద్దేశం.. వేరేగా ఉంద నేది పరిశీలకుల అంచనా. గత ఎన్నికలకు ముందు.. కొందరు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేశారు. వీరిలో ఒకరిద్దరు మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. అయితే.. వీరికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు కష్టమనే టాక్ వినిపిస్తోంది.
దీంతో ఇలాంటి వారు ఇప్పుడు మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరు ఇలానే గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు. గెలవడం, మంత్రి కూడా కావడం జరిగిపోయాయి. కానీ, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అంటే.. ఖచ్చితంగా ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందనే గ్యారెంటీ లేదు. దీంతో ఆయన తన అనుచరుల ద్వారా టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక, గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలోకి చేరి.. టికెట్ తెచ్చుకుని ఓడిపోయిన వారు కూడా ఇప్పుడు మరోసారి టీడీపీవైపు చూస్తున్నారు. ఇలాంటి వారిలో మాజీ ఎంపీలు ఇద్దరు ఉన్నారనేది టీడీపీ అంతర్గత టాక్. వైసీపీలో వీరికి ప్రాధాన్యం లేకుండా పోవడం.. ఎన్నికల వరకు వేచి ఉంటే.. టీడీపీలోనూ చాన్స్ మిస్సవుతుందనే ఆవేదన ఉండడంతో వీరు కూడా.. తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కానీ. ఇలా టీడీపీని వీడిన వారిపై క్షేత్రస్థాయిలో నేతలు ఆగ్రహంతో ఉన్నారు.
వాస్తవానికి వారు ఆర్థికంగా స్థితి మంతులే అయినా.. క్షేత్రస్థాయిలో నాయకులను తీసుకుంటే.. అది తమ్ముళ్లను మరింత రగిలిచినట్టు అవుతుందనేది ఒక కారణంగా ఉంటే.. మరోవైపు, ఇదే అలవాటు అవు తుందని కూడా.. చంద్రబాబు తలపోస్తున్నారు. ఇక, జనసేనతో ఎలానూ పొత్తున్న నేపథ్యంలో టికెట్లు కూడా ఖాళీగా లేవు. దీంతో బాబు.. చాలా వ్యూహాత్మకంగానే మాట్లాడారని తమ్ముళ్లు చెబుతున్నారు. జంపింగులకు ఇక, టీడీపీ ఎప్పటికీ ప్రోత్సహించబోదని అంటున్నారు.