జగన్ ఎందుకింత బేలగా ?
వైఎస్ జగన్ అంటేనే డేరింగ్ అండ్ డేషింగ్. అలాంటి జగన్ ఇపుడు ఎందుకో పదే పదే టీడీపీ వారి ట్రోలింగులకు గురి అవుతున్నారు.
వైఎస్ జగన్ అంటేనే డేరింగ్ అండ్ డేషింగ్. అలాంటి జగన్ ఇపుడు ఎందుకో పదే పదే టీడీపీ వారి ట్రోలింగులకు గురి అవుతున్నారు. జగన్ కి ఏమైంది అని టీడీపీ తాజాగా ట్వీట్ చేసింది. ప్రతిపక్ష హోదా లేకపోయినా హోదా కావాలీ అంటూ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారని, ఇపుడు సీఎం కాకపోయినా సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని మరో పిటిషన్ వేశారని ఇంతకీ జగన్ కి ఏమైంది అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. అది కాస్తా వైరల్ అయింది.
నిజానికి ఈ రెండు విషయాల్లోనూ జగన్ కోర్టు తలుపులు తట్టడం వెనక ఆయన వ్యూహాలు ఏమైనా వైసీపీలోనూ చర్చ సాగుతోంది. క్యాడర్ లోనూ ఒకింత నైరాశ్యం కలుగుతోంది. జగన్ అన్న వ్యక్తి ఒకే ఒక్కరు. ఆయనే ఇంతటి పార్టీని నిర్మించి అధికారంలోకి తెచ్చారు. అలాంటి జగన్ మళ్లీ ఒక్కడిగా వెళ్ళి ప్రజల మద్దతు సాధించలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
జగన్ ఈసారి ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం ప్రజల్తో పార్టీతో కనెక్షన్ కట్ అవడం. అలాగే పార్టీని పూర్తిగా పక్కన పడేయడం. ఈ విషయాలను ఆకలింపు చేసుకుని దాని మీద ఫోకస్ పెట్టి జగన్ వైసీపీని పునర్ నిర్మించుకుని రావాల్సి ఉందని అంటున్నారు. జగన్ అలా చేయకుండా ప్రతిపక్ష హోదా మీద న్యాయ పోరాటం చేయడం పట్ల పార్టీ లోపలా బయటా చర్చ సాగుతోంది.
కోర్టులో ఏ విధంగా తీర్పు వచ్చినా కూడా జగన్ కు హోదా ఇవ్వాల్సింది అయితే స్పీకర్ అని ఆయన విచక్షణాధికారాల మేరకే అది లభిస్తుందని జగన్ కి తెలియదా అని అంటున్నారు. జనాల్లో ఈ అంశాన్ని పెట్టి రాజకీయంగా టీడీపీని బదనాం చేయాలని అనుకున్నా దాని కంటే ముందు జగన్ ని బదనాం చేసేందుకు టీడీపీ చూస్తోంది. ఆ పార్టీకి ఆ అవకాశం జగన్ ఇచ్చారు అని అంటున్నారు.
హోదా లేకపోతే జగన్ అసెంబ్లీకి వెళ్లరా అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా ప్రశ్నించారు. ఇదే విషయం టీడీపీ కూడా ప్రశ్నిస్తోంది. దాంతో జగన్ కి జనంలో ఏమైనా సానుభూతి ఈ విషయంలో వస్తుందన్నది లేకుండా పోతోంది. అదే టైం లో జగన్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు అన్నది జనానికి అర్ధం అవుతోంది.
ఇక రెండవ విషయం తీసుకుంటే సెక్యూరిటీ. తనకు ప్రాణహాని ఉందని జగన్ కోర్టుకు వెళ్లారు. తనకు పూర్వపు భద్రతను పునరుద్ధరించాలని ఆయన కోరుతున్నారు. అయితే జగన్ కి సీఎం హోదాలో ఇచ్చిన భద్రత ఎలా ఇస్తామని టీడీపీ కూటమి అంటోంది. జగన్ కి అరవై మంది దాకా భద్రతతో సిబ్బంది ఉన్నారని బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందని ఇంతకంటే వేరేగా భద్రత ఏమి కావాలని నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. అంతలా అభద్రతాభావం ఎందుకు జగన్ అని ఆయన నిలదీస్తున్నారు.
జగన్ వైసీపీ అధినాయకుడు. అయిదేళ్ల పాటు సీఎం గా పనిచేసిన వారు. ఆయన ధైర్యంగా ఉంటేనే క్యాడర్ ధీర్యంగా ఉంటుంది. తనకే ప్రాణహాని ఉందని జగన్ చెప్పుకుంటే ఇక క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్ళిపోతుంది. జగన్ సెక్యూరిటీ తగ్గించలేదు అని ప్రభుత్వం అంటోంది. అయితే ప్రాణ హాని ఉందని భావిస్తే మరింతగా పెంచుతారు. కోర్టులో విచారణ తరువాత ఏ రకంగా తీర్పు వస్తుందో చూడాలి.
ఏది ఏమైనా జగన్ లేవనెత్తిన ఈ రెండు అంశాలూ ఆయన్ని జనంలో బలవంతుడిగా అయితే చూపించడం లేదు. పైగా ఆయన బేలగా ఉన్నారని చెప్పకనే చెబుతున్నట్లుగా ఉందని అంటున్నారు. జగన్ ప్రజా సమస్యల మీద కోర్టుకు వెళ్ళడం లేదని తన సొంతం గురించే వెళ్తున్నారు అని హోం మంత్రి వంగలపూడి అనిత చేస్తున్న విమర్శలూ వైసీపీని ఆలోచింపచేస్తున్నాయి. జగన్ వీటి మీద దృష్టి పెట్టకుండా వైసీపీని ఎలా పటిష్టం చేసుకోవాలి అన్న దాని మీదనే ఫోకస్ పెడితే బాగుంటుంది అని కూడా సూచనలు వస్తున్నాయి. అలాగే ఆయన అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆ వచ్చే మైలేజ్ వేరే విధంగా ఉంటుందని కూడా అంటున్నారు.