30న బీజేపీ-1న టీడీపీ... పండగే పండగ!!
ఆయా పార్టీల కీలక నాయకులు, ఎంపీలు, కేంద్ర మంత్రు లు.. కూడా.. వారి వారి పార్టీల అధినేతలునిర్దేశించిన కార్యక్రమాలకు హాజరువుతున్నారు. ప్రజల మధ్యే గడపనున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలుగా ఉన్న బీజేపీ, టీడీపీలు.. వరుసగా పండుగలకు సిద్ధమయ్యాయి. బీజేపీ నాయకులు ఈ నెల 30(ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండుగకు రెడీ అయ్యారు. అదేసమయంలో టీడీపీ నాయకులు జూలై 1న రాష్ట్రంలో పండుగ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఆయా పార్టీల కీలక నాయకులు, ఎంపీలు, కేంద్ర మంత్రు లు.. కూడా.. వారి వారి పార్టీల అధినేతలునిర్దేశించిన కార్యక్రమాలకు హాజరువుతున్నారు. ప్రజల మధ్యే గడపనున్నారు. గ్రామీణ స్తాయిలోనూ ప్రజలతో మమేకం అవుతున్నారు. దీంతో ఒక్కసారిగా రెండు పార్టీల్లోనూ జోష్ పెరిగింది.
ఏంటీ విషయం..
బీజేపీ విషయాన్ని తీసుకుంటే.. కేంద్రంలో మూడో సారి ముచ్చటగా మోడీ సర్కారు ఏర్పడింది. అయితే.. 2014లో ఆయన ప్రారంభించిన మనసులో మాట(మన్ కీ బాత్) కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా.. ఎన్నికైన తర్వాత.. తొలి మన్‌కీ బాత్ ఈ నెల 30(ఆదివారం)న నిర్వహిస్తున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ రేడియోలో తన ప్రసంగాన్ని వినిపించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 11.30 వరకు సాగే ఈ ప్రసంగానికి అత్యధిక ప్రాధాన్యం ఉన్న విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా అన్ని డీడీ చానెళ్లు కూడా ఈ మన్‌కీ బాత్ ను ప్రసారం చేస్తాయి. అనంతరం.. స్థానిక భాషల్లోనూ ప్రసారం చేస్తున్నాయి. దీనిని ఈ సారి మరింత వైభవంగా నిర్వహించాలని.. బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. దరిమిలా ఏపీలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యనాయకులు , బీజేపీ చీఫ్ పురందేశ్వరి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పండుగ వాతావరణంలో మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సో.. ఈ నెల 30న బీజేపీ ఏపీలో పండుగ చేయనుంది.
ఇక, టీడీపీ విషయానికి వస్తే..
రాష్ట్రంలో జూలై 1వ తేదీన ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. జులై 1వ తేదీన 65 లక్షల 18వేల 496 మంది వివిధ ఫించన్ దారులకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ ఫించన్లు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే 4,399.89 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని కూడా పండుగ వాతావరణంలో నిర్వహించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటలకు మొదటి ఫించన్ పంపిణీ జరగాలని ఆయన ఆదేశించారు.
ఫించన్ సొమ్ముతో పాటు తాను రాసిన లేఖను కూడా ఫించన్ దారులకు తప్పక అందించాలన్నారు. అంతేకాదు.. మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు.. ఇలా టీడీపీ కండువా కప్పుకొనే ప్రతి ఒక్కరూ పింఛన్ల పంపిణీలో పాల్గొని పండుగ వాతావరణంలో సంబరాల మధ్య పింఛన్లను పంపిణీ చేయనున్నారు. దీంతో ఏపీలో 1వ తేదీన టీడీపీ పండుగ చేయనుంది. ఇలా.. బీజేపీ 30న, టీడీపీ 1న వరుసగా ఏపీలో పండగలు చేయనుండడం గమనార్హం.