టీడీపీలో మండిపోతున్న మాజీ మంత్రి కుటుంబం...వైసీపీకి గొల్డెన్ చాన్స్...!?

ఇక 2024లో గుండ లక్షీదేవి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఆమెకు టికెట్ రాకుండా సొంత పార్టీలోనే ఒక బలమైన వర్గం నేతలు ప్రయత్నిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

Update: 2024-01-02 02:45 GMT

ఎన్టీయార్ హయాం నుంచి ఉన్న సీనియర్ రాజకీయ కుటుంబం గుండ అప్పల సూర్యనారాయణది. 1983లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా తంగి సత్యనారాయణ టీడీపీ నుంచి గెలిచారు. ఆయన్ని ఎన్టీయార్ స్పీకర్ గా చేశారు. అయితే తంగి సత్యనారాయణ 1984లో నాదెండ్ల భాస్కరరావుతో చేరి వెన్నుపోటు ఎపిసోడ్ లో భాగం అయ్యారు.

దాంతో 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గుండ అప్పల సూర్యనారాయణ ఫ్రెష్ గా ఆ పార్టీ నుంచి గెలిచారు. ఆయన అప్పట్లో ఎన్టీయార్ జమానాలో మంత్రిగా కూడా పనిచేశారు. అలా వరసగా 1989, 1994, 1999లలో ఆయన గెలిచారు. 2014లో ఆయన సతీమణి గుండ లక్షీదేవి విజయం సాధించారు. ఆమె 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు.

ఇక 2024లో గుండ లక్షీదేవి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఆమెకు టికెట్ రాకుండా సొంత పార్టీలోనే ఒక బలమైన వర్గం నేతలు ప్రయత్నిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం నుంచి ఈసారి శంకర్ అనే ఒక నేతను కోరి మరీ ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు టికెట్ ఇప్పించి గుండ కుటుంబాన్ని వెనక్కి పెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు.

దాంతో గుండ వర్గం ఈ పరిణామాల పట్ల మండిపోతోంది. కావాలనే తమకు టికెట్ దక్కనీయకుండా పార్టీలోని పెద్ద నేతలే చూస్తున్నారు అని అనుమానిస్తోంది. ఈసారి గుండ లక్ష్మిదేవికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన మహిళగా ఆమెకు మంత్రి పదవి కూడా ఖాయమని అంటున్నారు.

ఈ లెక్కలు అన్నీ వేసుకున్న మీదటనే టికెట్ దశలోనే పక్కకు పెట్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని గుండ వర్గం అంటోంది. ఇదిలా ఉంటే పార్టీ పట్ల విశ్వాసంతో ఉంటూ గత నలభై ఏళ్ళుగా పనిచేస్తున్న గుండ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని అనుచరులు కోరుతున్నారు.

ఓడిపోయినా కూడా గుండ కుటుంబం ప్రజలలోనే ఉందని గుర్తు చేస్తున్నారు. అయితే యువత పేరుతో కొత్త వారికి టికెట్ ఇవ్వాలని చూడడం అంటే పార్టీ గెలిచే సీటును కోల్పోయినట్లే అని కూడా అంటున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీ అధినాయకత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలని అంటున్నారు.

ఈసారి కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని టీడీపీ కూడా భావిస్తోంది. యువతకు టికెట్లు ఇస్తామని కూడా ఆ మధ్యన చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ కొత్త ముఖాలను జనంలోకి తెస్తున్నపుడు ఆ పార్టీకి లేని ఇబ్బంది మాకు ఎందుకు అని టీడీపీ నేతలు అంటున్నారు.

మరి గుండ లక్ష్మీదేవికి టికెట్ కాదని శంకర్ కి ఇస్తారా అన్నదే చర్చగా ఉంది. అలా జరిగితే గెలిపించుకోవడానికి మాత్రం గుండ వర్గం సహకారం అవసరం లేకపోతే మరోసారి ఇక్కడ ధర్మాన ప్రసాదరావు విజయం క్యాట్ వాక్ గా జరిగిపోతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News