విజయోత్సవ వేళ.. ఏపీలో ఇంత జరిగింది!

సంచలన విజయాన్ని సాధించిన నేపథ్యంలో విజయోత్సవాల్ని నిర్వహిస్తూ వైసీపీకి చెందిన మాజీ మంత్రుల ఆస్తులతో పాటు.. పలు చోట్ల దాడులకు తెర తీశారు.

Update: 2024-06-05 04:38 GMT

హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం తెలిసిందే. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో రాజకీయం వ్యక్తిగత స్థాయికి మారటం తెలిసిందే. ఎన్నికల ఫలితాల రోజు రాజకీయ దాడులు ఏ స్థాయిలో ఉంటాయన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే.. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం.. హింసకు పాల్పడే వారి విషయంలో అత్యంత కఠినంగా తీసుకుంటామన్న మాట బలంగా వినిపించటమే కాదు.. చేతల్లోనూ చూపించారు. అయితే.. పోలీసు బలగాలు అంచనా వేసిన స్థాయిలో స్పందించలేదన్న మాట వినిపిస్తోంది.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళలో టీడీపీ శ్రేణులు.. కూటమి నేతలు పలువురు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. గడిచిన ఐదేళ్లలో తమ చేతిలో లేని అధికారాన్ని పొందటం.. దాన్ని తమ ప్రత్యర్థులపై ప్రదర్శించాలన్న తీరును కూటమికి చెందినకొందరు ప్రదర్శించారు. దీంతో.. ఏపీలోని పలు ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకన్నాయి.

సంచలన విజయాన్ని సాధించిన నేపథ్యంలో విజయోత్సవాల్ని నిర్వహిస్తూ వైసీపీకి చెందిన మాజీ మంత్రుల ఆస్తులతో పాటు.. పలు చోట్ల దాడులకు తెర తీశారు. ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఈ పరిణామాల్ని నిలువరించటంలో పోలీసుల సరిగా స్పందించలేదన్న విమర్శ వెల్లువెత్తుతోంది.

విజయోత్సవ వేళ చోటు చేసుకున్న దాడుల ఘటనల్ని చూస్తే..

- గుంటూరులోని మంత్రి విడుదల రజనీ ఆఫీసుపై రాళ్లదాడి

- పల్నాడు జిల్లాలోని ఒక సచివాలయం పై దాడి

- మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కల్యాణమండపంపై దాడి.. ధ్వంసం

- ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొయిన్ గేట్.. ఆర్చిని జేసీబీతో కూల్చివేత.

- స్కూల్ ఆర్చిని.. గేట్ ను వైసీపీ సానుభూతిపరుడైన ముప్పా సుబ్బారావు రూ.5 లక్షల దానంతో నిర్మించారు. క

- ఇదే గ్రామంలో టీడీపీ నేతలు వైసీపీ సానుభూతిపరుడైన మాల్యాద్రి ఇంటికి జేసీబీని తీసుకొచ్చి గొడవకు దిగారు.

- పల్నాడు జిల్లా కొండూరులో టీడీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ సానుభూతిపరులు ఉన్న ప్రాంతానికి రావటం.. అక్కడి వారు అభ్యంతరం వ్యక్తం చేసిన వేళ గొడవ పెరిగి ..విషయం రాళ్లదాడి వరకు వెళ్లింది.

- క్రిష్నా జిల్లా మచిలీపట్నంలో బందరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి.. బందరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనాల్లో వైసీపీ కార్యకర్తలు ఉండే ప్రాంతాలకు వెళ్లి కవ్వింపు చర్యలు చేపట్టారు. దీనికి ప్రతిగా వైసీపీ కార్యకర్తలు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు.

- తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు ఆఫీసుకు వెళ్లి.. అక్కడున్న రెండు కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. పార్టీ ఆఫీసుపై రాళ్లు రువ్వారు. వైసీపీ ప్రచార రథంతో పాటు ఇన్నోవాకారు అద్డాలను పూర్తిగా ధ్వంసం చేశారు.

- పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో మండపాక గ్రామంలోని వైసీపీ ఇంటి ముందు క్రాకర్స్ కాల్చారు. ఈ సందర్భంగా నిప్పు రవ్వలు పడి ఇంట్లోని సామాగ్రి దగ్ఘమయ్యాయి.

- ఉమ్మడి అనంతపురంజిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో వైసీపీ జెండా దిమ్మను ధ్వంసం చేశారు.

- అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పలువురు టీడీపీ కార్యకర్తలు ఫ్యాన్ల రెక్కల్ని విరిచి టూవీలర్లకుకట్టి వీధుల్లో ఈడ్చుకుంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

- రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలానికి చెందిన వైసీపీ నేత జయచంద్రారెడ్డి కారును పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. మరికొన్ని గ్రామాల్లోనూ వైసీపీ నేతల ఇళ్ల వద్ద టపాసులు పేల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

- గుంటూరులోని వైసీపీ మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీసుపై టీడీపీ వర్గాలు దాడి చేసి.. ధ్వంసానికి పాల్పడ్డారు.

- చిత్తూరు పట్టణంలో రాఘవ కన్ స్ట్రక్షన్ ఆఫీసును ధ్వంసం చేసి.. నిప్పు అంటించారు. వైసీపీ సానుభూతిపరుడైన మార్కెట్ హరికి చెందిన సిగిరెట్ గోదాముకు నిప్పు అంటించారు. మరికొన్ని ఘటనలుచోటు చేసుకున్నాయి.

- పూతలపట్టులోని తెల్లగుండ్ల పల్లెలో వైసీపీ కార్యకర్తకు చెందిన జేసీబీని తీసుకెళ్లి.. అతని ఇంటి ప్రహరీనే కూల్చేశారు.

- చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఎండుగుంపాలెంలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

- గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోనూ వైఎస్ విగ్రహాన్ని ట్రాక్టర్ చేత గుద్దించి ధ్వంసం చేశారు.

- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సోదరుడు.. ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి.. అద్దాలు పగలగొట్టారు.

- పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో వైసీపీ నాయకురాలు.. గ్రామ సర్పంచ్ మంగతాయారు ఇంటి సమీపంలో నిర్వహించిన చర్చ ఘర్షణకు కారణమైంది.

- రాప్తాడు మండలంలోని పాలచెర్ల గ్రామ సచివాలయంపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేశారు.

- ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో ఒక పెట్రోల్ బంకు పైనా. దాని యజమానిపైనా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇదే జిల్లాలోని ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడులో ఒక కూల్ డ్రింక్ షాపు వద్ద మొదలైన వాగ్వాదం ఘర్షణగా మారింది.

- భీమడోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గొడవలు చోటు చేసుకున్నాయి. జనసేన కార్యకర్తలు వైసీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు.

- పల్నాడు జిల్లా కొచ్చర్ల సచివాలయంపై టీడీపీ.. జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.

Tags:    

Similar News